పుట:శ్రీ సుందరకాండ.pdf/117

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 10

               41
నృత్తకుశల యొక మత్తకాశిని వి
పంచిని విడనోపక నిదురించెను,
కామించిన వలకానితో చనువు
తీయమింత యెడబాయలే నటుల.
               42
మాంసలమై కోమలమగు మేను ని
గారింపగ, బంగారు వన్నె లొక
తీవబోణి మద్దెల వాయించుచు
పారవశ్యమున పవళించె నటులె.
               43
సన్నని నడుము పిసాళించు మఱొక
భ్రమరాలక తన పార్శ్వతలంబున
రతమృదంగ జంత్రము పడియుండగ,
తూగి శయించెను త్రాగిన మత్తున.
               44
తన డిండిమవాద్యము విడనోపక
ప్రక్క నుంచుకొని పవళించె నొక తె;
తరుణవత్సమును తక్కనొత్తుకొని
నిదురపోయె తరుణీమణి మఱొకతె.
                45
ఆడంబర వాద్యము నిరుకేలను
ఐయించిన ఒక భామ సొమ్మసిలి,
మధువు త్రాగి కడుమత్తున నొత్తిలి,
ఒడలెఱుంగ కటు లొరగి శయించెను.
              46
మదవతి యొక్కతె మద్యకుండికను
ఎత్తివైచి మధు వెగసి చిందిపడ,
పవ్వళించి కనబడె, వసంతమున
తడిసినపువ్వుల దండ చందమున.

106