పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/139

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర



మ॥ తన సేవించు నృపాలనందనులు కృర్ధత్వంబుమై నొండొరున్
    దన నేత్రమ్ముల ల మార్కొనుచు నంతంబొందఁ జూడన్ సహిం
    పని పుణ్యాత్ముఁడు నాఁటి కష్టదశఁ దీర్పన్ బూని యాత్మార్పణం
    బు నొనర్చెన్ హరభట్టు త్యాగనిధియై ముల్లోకముల్ మెచ్చఁగన్.80
    
మ॥ వనధిధ్వానగభీరఘోషము రహింప బ్రక్కకున్ వచ్చి సూ
    క్తుని వీక్షించి బ్రతాపుఁడు నినుఁ గనుంగొన్నన్ గడున్ బాపముల్
    జనియించున్ గలుగంగరాని యిడుమల్ సంధిల్లె క్షీరాబ్ధిఁబో
    లిన సూర్యాన్వయ మొందె నీకతన మాలిన్యంబు లీనాఁటికిన్. 81
    
ఉ॥ ఒత్తిడిచేసి కోరకుముయుద్ధము వద్దని కృష్ణసింహుఁడున్
    నెత్తిన నోరు పెట్టుకొనినీకు వచించే వినంగనైతి వ
    య్యు త్తము బోధమించుకయు నూఱక ప్రేలితి నేఁడు నీతలన్
    గ్రొత్తలు పుట్టె మిట్టిపడికొంపకుఁ జేటును దెచ్చి తెంతయున్. 82
    
మ॥ సమరంబున్ బొనరింప నుండఁగ వశిష్ఠప్రాభవాఢ్యుండు పు
    ణ్యమయుం డీహరభట్టు తా నుదయసింహక్ష్మాతలాధీశు చం
    దమునన్ వంద్యుఁడు ముందు దూఁకి మనమధ్యంబందునన్ వ్రాలి జీ
    వము లర్పించి త్యజించె దేహముఁ దృణపాయంబుగా నెంచుచున్ 83
    
చ॥ ఇతఁడును వేదరాశి శతవృద్దు కుమారులభంగి నిన్ను నన్
    సతతము వెంచె నిట్టి సుగుణతుఁడున్ బలియయ్యె నీదు మూ
    ర్ఖతవలనన్ గనుంగొనుము కాలువ గట్టుచు నమ్మహాత్ము ర
    క్తతతులు పాఱఁజొచ్చె నెటుకన్గొని యోర్చెద నిట్టిదృశ్యమున్. 84

మ॥ పలుకష్టమ్ములఁ గూడు నీళ్ళు గొన కీబ్రహ్మాండ మున్నంతకున్
    దలక్రిందౌచుఁ దపంబు చేసిన గురుధ్వంసాఘ పుంజంబులున్
    దలఁగన్ బాఱునే తన్మహానలశిఖల దర్పించి నిన్నున్ ననున్
    గులమున్ దేశముఁ గాల్పవే యెటుల నాకున్ దప్పు నిప్పాపముల్ 85
    
చ॥ గురురుధిరంబు దాఁటఁగనుగూడదు కావున నిప్డు నేను సం
    గరమును మానుటన్ బ్రదుకగల్గితి నీవిక నాదు రాజ్యమున్
    ద్వరగఁ ద్యజించి యిష్టమగుతావునకున్ జను మాలసించినన్
    శిరము నిమేషమాత్ర ధరణిన్ బడు నంచు వచింప సూక్తుడున్. 86