పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/45

ఈ పుట ఆమోదించబడ్డది

xxxxiv

దన్నిటను నిట్టి పద్దియములు కవులువ్రాసియే యున్నారు. ఒక తెలుఁగు గబ్బముల యందేగాదు సంస్కృతమునందును వ్రాయఁబడియున్నవి.............

శ్రీపూండ్లవారి గ్రంథము దొరకనందువలనను, ఇదంతయు మరల నెప్పుడు ఎవరు సేకరించి ముద్రింతురో యనుశంక చేతను, చక్కని విషయముండుటచేతను, చదువరులకు యథాతథముగా నుదహరించితిని. ఇక శ్రీపూండ్లవారు హెచ్చరించి, వివరింపక విడిచినది, హంసవింశతితోడి పోలిక. తెలుఁగుకవులకు నాచనసోముని కాలమునుండి ఒక అలవాటు కనఁబడుచున్నది. అదేదనఁగా అష్టాదశ వర్ణనలలోగాని వాని అంతర్బాగములలో గాని తమకాలపు శాస్త్రవిషయములను, పర్యాయపదములను ప్రయోగించుచుండిరి. నాచనసోముని కోటవర్ణనాదికముల పదములకు నేడు అర్థముచెప్పుట సులువుగాదు. అట్లే వృత్తులు వచ్చినప్పుడుకూడ, ఈ ప్రబంధరాజకవి ప్రతివిషయమునందును తన కవితా నైపుణితో తన సకలశాస్త్ర కలావేత్తృతను వెల్లడించినాఁడు.

(1) తన కవిత్వములో గల గుణములనిట్లు చెప్పుకొన్నాఁడు - 'సీ. అలవిన్న కోట పెద్దనలక్షణజ్ఞత' ఇత్యాదిముందే యుదాహృతము. ఒక్క సీసపద్యములో ఆంధ్రవాజ్మయ చరిత్ర సారమునిమిడ్చి, ఆ గుణములన్నియు తనలో కలవన్నాడు. తెలుగులో నాటి కేర్పడిన రచనా ప్రక్రియలన్నిటిని ఒక చేయి చూచినాడు.

(2) పెక్కువిషయముల కిది యొక నిఘంటువో లేకపోయిన జాపితావంటిది. భగవంతునికి అంకితముగా తాను వ్రాయనీకావ్యమునకు గల సాహిత్యలక్షణములను మొదటి వచనమందే చెప్పినాడు-- “అంకితంబుఁగా శబ్దశాస్త్రరీతికి విఖ్యాతియును, ధ్వనులకునికియును, ఉక్తాత్యుక్తాదిగాగల యిరువదాఱు ఛందంబులకుఁ జందంబును, కావ్యాలంకార చూడామణికి కావ్యాలంకార సంగ్రహమ్మును, సకలా లంకారమ్ముల కలంకారంబును...' ఇత్యాదిగా కావ్య శాస్త్రవిషయమును గుప్పించినాఁడు.

వేంకటాచల పట్టణవర్ణనలో, వచనమున ‘మఱియు నప్పురవరంబు మందాక్రాంతఫల సదవవన మంజరీ మందార సరజితోత్పలమాలికా...' అని యారంభించి 'మంగళమహాశ్రీ' వఱకుగల వృత్తములనన్నిటిని వరుస కూర్చినాఁడు.