మాయాంధకారౌఘ మాక్రమించకమున్నె
బొడముఁ దావక కీర్తి పూర్ణచంద్రుఁ
డాచంద్రుఁ డుదయాద్రి నవతరించకమున్నె
కొమరొందు సజ్జనకుముద నివహ
గీ. మహహ హిమధర బహుతట కుహర విహర
మాణ సురసరి దురతర మధురనినద
దళన చణజయదరరవకలిత హృదయ
మానిత శుభాకృతివిలాస శ్రీనివాస. 824
కందద్వయగర్భిత భాస్కరవిలసితవృత్తము ముద్రాలంకారము
పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతతవిహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుదసితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా. 825
1. గర్భితప్రథమకందము
పంకజదళ నిభలోచన
శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ
పంకోరస్థలకృతపద వననిధి కన్యా
2. గర్భితద్వితీయకందము
లంకృత మణిగణభూషణ
యంకీకృత మృదుగతి మరుదసితశరీరా
వేంకటగిరివర రుచ్యక
లంకా భాస్కరవిలసిత లగదరిహస్తా
ఈ వృత్తముపేరు భాస్కరవిలసితము అని పద్యంలో రావడం వల్ల ఇది ముద్రాలంకారమౌతుంది.
ప్రమితాక్షరవృత్త కందగర్భిత నాగబంధయుక్తి చంపకమాలికావృత్తము
చ. ఘనఖగరాజమాన హయగాయగదస్థిరనాగ భోగహా
జనజగతీతలేనవర సారకనన్నిజ భోగమోదనా
నననగవాహలూన భయ న్యాయగ తీవ్రత రాగదీనపా
యన యగధీరమానజయదా యరిగర్వహరాగ వాతిగా. 826
పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/320
ఈ పుట అచ్చుదిద్దబడ్డది