అపూర్వప్రయోగము — చతురక్షరయమకము
తే. కంతుకంబు విలాసంబు గళము డంబు
కంతుకంబు విలాసంబు గనుకుచంబు
నెఱసరిని మించు మించు కేలొరపు బొడము
నెఱసరిని బెంపుజెంపుగా నెలతనడుము. 667
గీ. హరిపదముఁ బోలు జవరాలి గౌనుకౌను
మిక్కుటద్దములను గొమ చెక్కుఁ జెక్కు
గులుకు దేటుల కింతి ముంగురులు గురులు
గరిమ నిలకన్న కన్న జఘనము ఘనము. 668
గూఢతృతీయసీసము
సీ. జవరాలి చిఱునవ్వు చవిమోము నెమ్మోము
చంద్రబింబస్ఫూర్తి నవధరించుఁ
దలిరాకుఁబోఁడి నున్బలుకులు హస్తము
ల్గళము సితాబ్జవైఖరి ధరించు
చిలుకలకొల్కి చూపులు నెన్నడుము కు
తలములు నీలాభ్రవిభ్రమము మీఱు
గామినీమణి నాస కటి గుబ్బచన్గవ
కనకాచలోన్నతి గరిమ మీఱు
గీ. వెలఁది మైజిగి నఖములు వ్రేళ్ళు మెఱుఁగు
రిక్కలగు నింతి వీను లాకృతియు నూరు
లు నవరంభాస్థితి జయించు వనిత నడుపు
జడయు నూగారు నాగాళి సరణి గెల్చు. 669
క. అని పొగడి గడియ కల్లల
గని యుడుగని వలపుసెకల గని కలగనిగ నె
మ్మనమునఁ గినుక న్గొనక
న్గనుసన్న బ్రసన్నత నిడి కటకటఁ బడుచున్. 670
పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/264
ఈ పుట అచ్చుదిద్దబడ్డది