గీ. దారఁబోసియున్న తదనంతరంబున
బంధుజనులు మోదభరితు లగుచు
నిరువురకును సిగ్గుతెర జాలదే యంచు
నవ్వుకొనుచుఁ దెర నొనర్చిరంత.
క. మరుఁ డా నడుమను నెలకొని
గరగిరి గరువగను దమ్మి కలువల కోరుల్
సమకూర్చి యేసెనో యన
నిరువుర నెఱిజూపు లమరె నిరువురమీఁదన్. 596
శా. రాకాచంద్రముఖీజనంబులు మదిన్ రాగంబు లుప్పొంగఁగా
జోకల్ గూడుక వర్ణభేదములచే సొంపుల్ జెలంగ న్బికా
నీకోదారరవంబు మీఱ బుధులెంతే సన్నుతు ల్సేయఁ గౌ
రీకల్యాణముఁ బాడి రప్డు గరుడాద్రిస్వామి కిం పొందఁగన్. 597
క. చెంగటను జేరి ధవళము
రంగుగ వినుపింప నిజకరమ్ముల నలమేల్
మంగనుఁ బ్రేమ న్గళమున
మంగళసూత్రంబుఁ గట్టె మరుగురుఁ డంతన్. 598
క. పుత్తడిపళ్ళెరములఁ దెలి
ముత్తియపుంబ్రాలు నించి ముదమున మంత్రుల్
హత్తి యిరుగడల నుండఁగఁ
జిత్త మలర శౌరి బ్రాలు జెలితల నుంచెన్. 599
క. కొప్పున జాఱిన తలఁబ్రా
లప్పుడు సతి కొప్పె వింతయై చూపఱకున్
గప్పు మొగుల్ ముత్తెంబులు
కుప్పలుగా మేలు వాన గురిసిన భంగిన్. 600
వ. అట్టి సమయంబున.
ఉపమాలంకారము — అపూర్వప్రయోగము
క. కులుకువలి గబ్బిగుబ్బల
కలిమి చెలిన్ హరి కరమ్ముఁ గైకొను టొప్పెన్
వెలిదామర విరి మొగడలు
గలకమలిని గమిచినట్టి కలహంస బలెన్. 601
పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/246
ఈ పుట అచ్చుదిద్దబడ్డది