గీ. వలయ నగవలయితధరావలయమునకుఁ
బతివి గమ్మన్నరీతి నారతులు ద్రిప్పి
భువిని నాచంద్రతారకంబుగ సుఖించి
యెపుడు మనుమనుక్రియఁ బొడవెత్తి రపుడు. 588
క. పుడమిఁగల సాము లందఱ
వడి నితనికి సాటిఁ బోలవచ్చినవారి
న్నొడసి పడవైతుమను క్రియ
వడి నెఱ్ఱనిపూలఁ ద్రిప్పివైచిరి మిగులన్. 589
ముద్రాలంకారము
మత్తకోకిల. గానవైఖరినందు గొందఱు కాంత లయ్యెడఁ జేరి సో
బానయంచొక పాటఁ బాడఁగ బాడినంతనె వింతయై
గానుపింపఁగఁ బూర్వశోభన గాథలెల్లను మీఱఁగా
మాని నుల్కవగూడి పాడిరి మత్తకోకిల రీతులన్. 590
క. అంతటఁ గూరిమి యల్లుని
సంతసమున డాయఁజేరి జనపాలకుఁడున్
గాంతాయుతుఁడై మణిపీ
ఠాంతరమున నుంచి విప్రులనుమతి జేయన్. 591
గీ. పసిఁడిచెఱఁగులు గల మధుపర్క మిచ్చి
సకలమణిమయరుచిరభూషము లొసంగి
రమణ నిర్వుర గోత్రనామములు జెప్పి
యనుఁగుటల్లునిఁ బ్రార్థన మాచరించి. 592
క. సుముహూర్త మనుచు సాధు
క్రమమున భూసురులు బలుకఁ గా భూవిభుఁడున్
రమణియు మనమున నడలొక
క్రమమున నడుపుచును గౌతుకము మెఱయంగన్. 593
క. అభ్యంతరులగు దొరలున్
సభ్యులు వినుతింపఁ బెండ్లి జగతి న్నియతిన్
‘తుభ్యం ప్రజాదిసత్క
ర్మభ్యః ప్రదదామి’ యని కరమ్మునఁ గన్యన్. 594
పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/245
ఈ పుట అచ్చుదిద్దబడ్డది