పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/234

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేశంబు నిద్దురలేక యుండె లతాంగి
యంగదచే డస్సె నలరుఁబోఁడి
చక్కటిఁ బుయిలోటిఁ దక్కె జక్కవచంటి
చేర నుంకించెఁ గర్పూరగంధి
గీ. మోహమున సొమ్మసిల్లె నంభోజవదన
వరుస నీ తొమ్మిది యవస్థ లరసి యిప్పు
డలరుమేలు మంగమ యని పలికినంత
మదిని వెఱఁగంది ముదమంది మమతఁ జెంది.555

షోడశరాజయుక్తకందము — మరుత్ అని విచిత్రప్రయోగము
క. భువి భరత భగీరథ భా
ర్గవ మాంధా త్రంబరీష రంతి శిబి సుహో
త్రవిభు దిలీప మరు ద్రా
ఘవ పృథ్వంగ శశిబిందు గయ నహుషు లనన్. 556

వ. మీఱిన యీనారాయణవనపాలకుండు మున్ను ముక్కంటిచేత విన్నవాఁడు గావునఁ దనముద్దుకూఁతురి మనోభిలాషంబునకు ననుకూలసంభ్రమాయత్తంబైన చిత్తంబునఁ దేజరిల్లి తల్లీలోద్యానవనపద్మసరోవరప్రాంతకేళీసౌధాంతరంబునఁ బుత్రికారత్నంబు నుండ నియమించె నంతట. 557

అశ్రువు
ఉ. చూచి విరాళి జాలిఁ బడుచున్ బడుచున్ వగఁ బూపపాయపున్
రాచమిటారి తాల్మి వలరాచకటారికి నగ్గమౌటచే
లోచని జిక్కి సారసవిలోచనముల్ ముకుళించి మెల్లనే
లేచుఁ బడున్ గలంగుఁ దరళీకృతబాష్పముఖారవిందయై. 558

మోహము
సీ. తరుణి యంతటనుండి తాపంబుచే మాట
లాడదు జెలులతో నాడఁబోదు
గతి వేడఁ దొల్లింటిగతి వీణ మేళంబు
సేయదు బ్రేమఁ గైసేయఁబోదు
సకియలు సంగీతసాహిత్యరీతులఁ
జదువఁగా వినదు దాఁ జదువఁబోదు
సరసపదార్థముల్ సరవి జిహ్వను రుచిఁ
గొనదు మోదంబును గొనఁగఁబోదు