ముక్తపదగ్రస్తఘటితమధ్యవృత్తము
చ. దులదులమించు కన్దొగలతోఁ గల తోరపుచందుమోముతో
దుల ఫణిగాఁగ మించు జడతోజడతో రుప క్రమంబుతోఁ
దొలఁకెడు వీక్షణాంచ దళితో దళతోడు నఖప్రభాళితో
తొలగకఁ గొల్చు కోపనలతో నలతొయ్యలి చాల లోలయై. 446
సర్వగురువచనము
వ. ఆవేళం దాశ్చర్యారూఢాత్మాంభోజాద్యత్కందర్పాటోపస్ఫాయన్నారాచస్తోమశ్రేష్ఠోద్బోధాధీనాంచద్బోధానైపుణ్యప్రౌఢి శ్రీనారీరత్నం బిట్లూహించెన్. 447
సంశయాలంకారము
సీ. రతినాథుఁడో కాఁడు రతినాథుఁడైన న
య్యలరువిల్లును బువ్వుటమ్ము లేవి
నలకూబరుఁడొ కాడు నలకూబరుండైన
రహిఁ గూడి బాయని రంభ యేది
చంద్రుఁడొ కాఁడల్ల చంద్రుఁడైనను మేన
ననువైన నేణలాంఛన మదేది
యింద్రనందనుఁడొ గాఁ డింద్రనందనుఁడైన
ననిమిషత్వము కన్నులందు నేది
గీ. యలరు విలుఁదీసి రంభను దొలఁగఁజేసి
కందు కడనుంచి యనిమిషగతి నడంచి
యవనికై వచ్చు నీ నల్వురందు నొకఁడు
గాక నృపుఁడైన నీసోయగంబు గలదె. 448
ప్రాసభేదము
క. అని సంశయంబుతోఁ దన
మనమునఁ జర్చింపఁ గనకమాలి కనియె నే
నినుఁగని దెల్పిన నారా
యణుఁ డితఁడే జక్క జూడవమ్మా కొమ్మా. 449
పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/205
ఈ పుట అచ్చుదిద్దబడ్డది