పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

శ్రీ దేవీ భాగవతము


ఉ. కాన విషాదమున్ దొఱఁగి కార్యము నారయుఁ డింకమీద వి
    ద్యానిధు లీరు సర్వజగదంబ సనాతని మూలకంద వి
    జ్ఞానవిశాల దేవి పరశక్తి సమస్త చరాచరంబులన్
    దాను భరించు నట్లగుట ధ్యానము సేయుఁడు భక్తియుక్తులై. 146

వ. అని చెప్పి సూతుం డో మహర్షులారా పద్మసంభవుండు పూర్వోక్తవిధంబునం దేవ
     తల నూఱడించి తన యెదుట నిజశరీరంబులతో నిలువంబడియున్న నిగమంబులం
     గని యిట్లనియె. 147

మ. స్తుతిఁజేయుం డికఁ గార్యసాధనిని సంతుష్టాత్మభక్తవ్రజన్
    సతి గూఢాంగి సనాతనిన్ సుగుణ సచ్ఛక్తి న్మహామాయ నం
    చతిభక్తిన్ వచియింపఁగా విని శ్రుతివ్యాహారముల్ సుందరా
    కృతు లై దేవిని సర్వలోకజననిం గీర్తించె సంప్రీతిమై. 148

దండకము. దేవీ సమస్త ప్రపంచాత్మ వస్తు ప్రశస్తత్వ విస్తారిణీ | నిస్తులానన్త ధీస్తుత్యుదార
    ప్రకార ప్రచార ప్రభాకార సంచార సంశోభినీ ! నిర్గుణా ! దుర్గమానర్గళా ! స్వర్గదా !
    వర్గదాత్రీ ! జగజ్జాల కర్త్రీ ! నమ జ్జీవభర్త్రీ , ద్విషజ్జాతిహర్త్రీ , కనన్, శ్రీవి నీవే
    యికన్ ధీవి నీవే క్షమా శాంతి కాంత్యాదులు న్నీవె మేధా ధృతుల్ నీవె యుద్గీ
    థమం దర్ధ మాత్రంబు నీవే నిజం బెస్న గాయత్రియు న్నీవె కీర్తి స్పృహాదుల్ జయా
    దుల్ మహామాయవు న్నీవె యా సత్తునుం జిత్తు నానందము న్నీవె కా వాక్స్మృతి
    హ్రీవరేణ్యాది రూపంబులం బొంచి పాపంబులం జెండి కారుణ్యమూర్తిత్వముం గల్గి
    బ్రహ్మాచ్యుతేశేంద్ర వాగ్వహ్ని భాస్వద్దిగీశాదులం దుండి శక్తి స్వరూపంబునన్ - సర్వ
    కార్యంబులం జేయు తల్లీ! సృజింపంగ బ్రహ్మన్ భరింపంగ విష్ణున్ హరింపంగ
    శంభున్ బొసంగించి తీ వెవ్వఁడైనం భవత్పాదపద్మంబులం గొల్చినన్ వాని నిస్సార
    సంసారశోకాబ్దికి న్నావవై తేల్చి తీరంబునం జేర్తు వీవేకదా నిన్ను గీర్తింప
    నెవ్వాఁడు నేర్చు న్నమస్తే నమస్తే యటంచుం భవత్పాదపద్మంబులం గొల్తు శ్రీ - శ్రీ.149

ఉత్సాహ. నీదు రూప మెవ్వఁ డెఱుఁగు నిత్యసత్య రూపిణీ
    నీదు సంజ్ఞ లెవఁడు సెప్ప నేర్చు నోర్చు నెన్నఁగన్
    నీదు గుణము దెలియువాఁడు నేడు నాడు లేడుగా
    నీదు మహిమఁ గంటి మేము నెమ్మి నమ్మి కొల్చుచున్. 150

క. దేవతలలోన భగవతి | యేవాఁ డనియు భవన్మహిమఁ గొనియాడన్
    ద్రోవ యెఱుంగునె నీవే | దేవి వనుచుఁ దలఁచెదము గదే మా తల్లీ. 151