పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/26

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శారదాంబాయై నమః

శ్రీ దేవీభాగవతముయొక్క మహాపురాణత్వవిచారము

₪₪♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦₪₪

ఇప్పటివారిలో కొందరు విష్ణుభక్తిపరులు విష్ణుభాగవతమె మహాపురాణమనియు దేవీభాగవత మనునది పూర్వము లేనే లేదనియుఁ జెప్పుదురు. కొందరు శాక్తులు దేవీభాగవతమే మహాపురాణముగాని విష్ణుభాగవతము కాదనియు, విష్ణుభాగవతమును బొప్పదేవుడను వాడు కొన్నాళ్ళక్రిందట రచియించినా డనియు వ్యాసప్రోక్తము కాదనియుం జెప్పుదురు.

పురాణములు రెండు విధములనియు, అందు కొన్ని మహాపురాణములును, గొన్ని యుపపురాణములు న ని జెప్పెదరు. కాని మహాపురాణములన్నియు వ్యాస ప్రోక్తములే యందురు. ఉపపురాణములలో కొన్ని యితర ఋషులచేఁ జేయబడినవి కూడ నున్నవి యందురు. ఈ విషయము నుభయపక్షములవారును ఒప్పుకొనుచున్నారు.

మహాపురాణములయినను ఉపపురాణము లయినను మరి యే తంత్రము లయినను ఏ శాస్త్రము లయినను వ్యాసప్రోక్తములలో మహిమయందు తారతమ్యము కలదని యే యాస్తికుడునుఁ జెప్పడు. ఇప్పటి శాక్తులును, ఇప్పటి వైష్ణవులును జెప్పు విషయములు అగ్రాహ్యములు. ఇందులో నెవ్వరు విశ్వసనీయులు, ఎవ్వరవిశ్వసనీయులు అని విచారించుట యతిదుర్లభము. కావున భాగవతములు రెండును కల్పితములు అని చెప్పవలసివచ్చును. ఆస్తికుల కది క్షేమముకాదు. వారి వివాదములు పరిష్కరించ బూనుటకంటె వారి వివాదమును వినకయుండుటయే పరమ శ్రేయము.

ఇకను ఏది యుపపురాణమని, ఏది మహాపురాణమని విచారించుట అనవసరము, వ్యాసప్రోక్తమనుటయే చాలును. పూర్వుల యభిప్రాయభేదములతోఁ బనిలేదు. అయినను గొన్ని వ్రాసెద.