పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/233

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

శ్రీ దే వీ భా గ వ త ము


ఉ. అంతట నొక్కనాఁడు జగదంబ నిశాంతరవేళ వచ్చి సీ
    మంతిని స్వప్నమందనియె మానిని నీకు వరం బొసంగెదన్
    భ్రాంతివహింప కిప్డుడుగుమా యనఁ జూచి ముదంబుమీఱ న
    త్యంతము సిగ్గునన్ శశరశాఖడ పల్కక యూరకుండినన్. 409

తే.గీ. తరుణి నీదు తలంపు సుదర్శనుండు | వరుడు గావలెననియె నే నెరుఁగనొక్కొ
   వాడు నాభక్తుడతడె నీ వరుడు సుమ్ము | మనము నందిట్లు చింతిల్ల మానుమింక.410
    
క. అని పల్కిన దేవి వా | క్కున సంతనమంది లేచి కోమలి తనలో
   నను గిలకిల నగికొనుచు | న్నన ుదల్లి యదెల్లగాంచి నవ్వుచు ననియెన్.411
   
తే.గీ. ఏమి నాతల్లి మున్ను నీ కింతమొగము | లేదు వికసించినది నేడు లేఁతఁదమ్మి
   సూర్యదర్శనమునఁబోలె జూడ దీని | కొక్కకారణ మెద్దేని యుండుఁ చెపుమ.412
   
క. అనఁ దలవంచుక యేమియు | ననజాలక వెనుకఁరిగి యనుగు జెలియతోన్
   తన స్వప్న క్రమమెల్లను | వినిపించెను జెవిని పెదవిపెట్టి గుసగుసన్.413
 
క. తల్లియుఁ జెలులున్ మిక్కిలి | యుల్లసిలిరి యట్టులుండ నొకనాఁ డా సం
   ఫుల్ల సరోజేక్షణ దాఁ | దల్లికి నిట్లనియె మృదుసుధామధురోక్తిన్. 414
   
క. ఈనాఁ డుపవనభూమికి | నేనును జెలికత్తియలును నేగెదమమ్మా
   మానక సెలవిమ్మనినఁన్ | మానిని లగ్గనిన నేగె మంజులవనికిన్.415
   
క. మొల్లలు జాజులు పొగడలు | మల్లెలు సంపంగిపూలు మఱి విరజాజుల్
   కొల్లలుగఁ గోసికొనుచున్ । ఫుల్లసరోజాక్షి సూచె భూసురు నొకటన్.416
   
వ. చూచి.417

ఉ. ఎచ్చటనుండి యెచ్చటికి నేగెదు బ్రాహ్మణ నా నమస్కృతుల్
    బుచ్చికొనుం డనంగ విని భూసురుఁ డో విమలాంగి నీకు నే
    నిచ్చెద దీవన ల్తడయ దింతయు నీకు వివాహ సిద్ధియౌ
    నచ్చుగ నీవిభుండు సుగుణాఢ్యుఁడు నయ్యెడు నంచుఁ బల్కినన్.418
    
క. విని సవ్వి యత్తలోదరి | వినయాన్వితయగుచుఁ బలికె విప్రవరా యెం
   దుననుండి వచ్చెదవు నా | ఘనభారద్వాజుపల్లెకడనుండి యనన్.419
   
క. ఆ యాశ్రమమున నద్భుత | మేయది కలదనుచుఁ జంచలేక్షణ యడుగన్
   దోయజలోచన వినుమా |తోయ మొకటి యచటఁ గలదు స్తుతిపాత్రముసూ.420
   
తే.గీ. కొమరుగలవాఁడు ధ్రువసింధు కొడుకు వాని । నామము సుదర్శనుం డెలనాగ యతని
   పేరు సార్థకమేకాని వేఱుకాదు | పొడవులై యొప్పు బాహువుల్ వెడదఱొమ్ము.421