పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/205

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

శ్రీ దే వీ భా గ వ త ము


వ. అని నారదుండడిగినం గమలగర్భుండు పుత్త్రకా! గుణంబులకును మూఁడుశక్తులు కలవు.
    సాత్త్వికంబున జ్ఞానశక్తియు, రాజసంబునకుం గ్రియాశక్తియుఁ, దమోగుణంబునకుం
    ద్రవ్యశక్తియుఁ గలిగియుండు. నందుఁ దామసంబునందలి ద్రవ్యశక్తి వలన శబ్దస్పర్శరూప
    రసగంధంబులను నయిదు తన్మాత్రంబులు పొడమె. శబ్దమను నొక్క గుణముమాత్ర
    మాకాశంబునకుం గలదు. వాయువునకు స్పర్శగుణంబును, నగ్నికి రూపగుణంబును,
    జలంబునకు రసగుణంబునుఁ, బృథివికి గంధగుణంబునుఁ బొసంగియు భూతపంచకంబును
    దన్మాత్రంబులుం గలసి యీపదియును ద్రవ్యశక్తులై తామసంబైన యహంకారంబునం
    బుట్టినయవి. రాజసంబగు క్రియాశక్తికిఁ ద్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణంబులను నైదు
    జ్ఞానేంద్రియంబులును, వాక్పాణిపాదపాయూపస్థలను నైదు ర్మేంద్రియంబులు
    నుత్పన్నంబులయ్యెె. మరియు బ్రాణాపానవ్యానోదానసమానంబులను నైదు ప్రాణంబులు
    నుఁ బుట్టె. నీ పదియేను రాజససర్గంబనంబడు. ఇవియ క్రియాశక్తి మయంబులగు సాధ
    నంబులు, వీని కుపాదానంబు చిత్తునాబడు జ్ఞానశక్తి. సత్త్వంబునం దిశలును, వాయువును,
    సూర్యుండును, వరుణుండును, నశ్వినులును జ్ఞానేంద్రియాధిష్ఠాన దేవతలై ప్రవర్తిల్లిరి.
    బుధ్యాద్యంతఃకరణ చతుష్టయంబున కధిష్ఠానదేవతలై చంద్రుండును బ్రహ్మయు
    రుద్రుండును విరాజిల్లెదరు. ఇవి మనస్సుతోఁ గూడి పదియేనును సాత్వికసర్గంబునాఁబడు.
    స్థూలసూక్ష్మభేదంబులచేఁ బరమాత్మకు రెండుభేదంబులుండు, జ్ఞానరూపముమాత్రము నిరా
    కారమును గారణమాత్రము నైయుండు. ధ్యానాదులయందు సాధకంబైనది స్థూల
    రూపంబగు. మహాపురుషుని శరీరంబు సూక్ష్మంబగు. నిది వింటివికదా సూత్రరూపంబునం
    బరఁగు మదీయ శరీర క్రమంబును వివరించెద వినుము. 158
    
సీ. ఐదు భూతంబులు నైదు తన్మాత్రము లైదగు జ్ఞానేంద్రియములు మఱియు
    నై దగు కర్మేంద్రియము లైదుప్రాణము లీరీతినుండుట యిదియసూడ
    బంచీకరణ మొనరించినఁ దెలియును దత్వంబులెల్లను దనయ నీకు
    మొట్టమొదట రసమునుగొని మనసుతో నమరించి యుదకమ ట్లాత్మనెంచి
    
తే.గీ. వేఱువేఱుగ నందులో వివిధభూత | ములను బదనించి చైతన్యమునుగలిపిన
    నేనగుదు సంశయములేదు దీనినమ్ము | తెలియుమిదిచక్కఁగా నెమ్మదిని గుమార! 159
    
తే.గీ. మఱియు నిందువిశేషాభిమానమహిమ | నాదినారాయణుఁడు విష్ణుఁడాయె జుమ్ము
    భూతతన్మాత్రయోగంబు పొరసికాదె యీ యజాండంబులును జనియించి మించె. 160
    
వ. పుత్త్రకా! వెండియుం జెప్పెద వినుము. ఆకాశంబునకు శబ్దంబొక్కటియు, శబ్దస్పర్శంబులు
   వాయుపునకును, శబ్దస్పర్శరూపంబు అగ్నికిని, శబ్దస్పర్శరూపరసంబులు జలంబునకును,
   శబ్దస్పర్శరూపరసగంధంబులు పృథివికిని గుణంబులై సకల బ్రహ్మాండోత్పత్తి యగునని
   యెఱుంగునది. తత్తదంశభేదంబులం జేసి యెనుబది నాలుగుకోట్ల జీవరాసు లుద్భవిల్లె.
   నిదియె సర్గక్రమంబని చెప్పి మఱియు.161