పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/186

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదాంబాయై నమః

శ్రీ దేవీ భాగవతము

తృతీయ స్కంధము

క. శ్రీ డ్విబుధ జ్యేష్ఠ స్వా | రాడ్వైశ్వానరపరేతరాడ్రక్షంభో
   రాడ్వాయుధనదలసదవి | సృడ్వైభవ సంప్రకాశ శ్రీసోమేశా. 1
 
వ. అవధరింపుము భగవంతుండైన సాత్యవతేయుం జూచి జనమేజయుం డిట్లనియె.2

జనమేజయకృత దేవీస్వరూపాది ప్రశ్న


సీ. అయ్య సాత్యవతేయ యంబామఖంబని యీరు నెప్పిన యజ్ఞమెట్టిదొక్కొ
    యెట్లది పుట్టెనో యెక్కడనో కతంబేమియో తద్గుణం బేమియొక్కొ
    యేస్వరూపమొ విధులెవ్వియో సర్వజ్ఞ దీనదయాపర తెల్పుమయ్య
    బ్రహ్మాండ మెట్టుల ప్రభవించెనో సవిస్తరనుగఁ జెప్పుమా ధర్మచరిత

తే.గీ. బ్రహ్మయును విష్ణువును శూలపాణి మువుఱు | దేవతలు సృష్టి సంరక్షణావసాన
    కర్తలును సగుణులు నండ్రు కడగి వార లొగిస్వతంత్రులో తెలుపుమా యోగివర్య. 3

తే.గీ. మృత్యువున్నదో వారికి నిత్యులో యనిత్యులో సచ్చినానంద నిరతులో స
    మస్త దుఃఖాది భౌతికమగ్నులో య | శనిధరాదులు కాలవశగులొ కారొ 4

క. దివిజులపుట్టువు లెట్టివొ పవిధరముఖులకును శోకభయములు కలవో
    తవులునొ నిద్రాలస్యము లవి వారికి ధాతుమయములౌనో తనువుల్.5

తే.గీ. ఏద్రవంబుల దేహంబులేర్పడినవొ | యేగుణంబుల నెసఁగెనో యింద్రియములు
    వారిభోగంబు లెట్టివో వారియాయు | వెంత కాపుర మెక్కడ ఋభువులకును. 6

వ. అనిన వ్యాసుండు. 7