పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/137

ఈ పుట ఆమోదించబడ్డది

94

శ్రీ దేవీ భాగవతము

చ. చనుము విదేహు నొద్దకు విచారపరుం డఖిలైకవేది యా
    జనవరుఁ డాత్మబోధమునఁ జాలిన వాఁడు నిరర్గళ స్థితిన్
    మనుచు భువిన్ సజీవుఁడయి మానిత ముక్తినిఁ గన్నవాఁడు నీ
    కనుపమ వృత్తిఁ జూపునతఁ డానతి యిచ్చిన త్రోవఁ బోఁదగున్.666

క. అనిన విని విస్మితుఁడనై | చనుదెంచిన వాఁడ నిటకు జననాయక నా
    కును దెల్పు మోక్షమార్గం | బనినన్ జనకుండు శుకున కనియెన్ బ్రీతిన్.667

సీ. విను మునిబాలక విప్రుండు మోక్షార్థి యగునేని బ్రహ్మచర్యాశ్రమమ్ము
    నందుండి వేదవేదాంతము ల్పఠియించి గురుదక్షిణ నొసంగి పరమనిష్ఠ
    నమరి నమావర్తనము చేసుకొని పెండ్లియాడి చక్కని భార్యఁ గూడి న్యాయ
    వృత్తిని బ్రతుకుచు వీతిహోత్రుని మెప్పు సలిపి దయా సత్య శౌచములను
తే.గీ. విడక పుత్త్రులఁ బౌత్త్రుల బడసి పిదప | కాననం బాశ్రయించి నిష్కాముఁడగుచు
    వెనుకఁ దనయాత్మయం దగ్నులను వహించి | పుణ్యసన్యాసి భావంబు పూనవలయు.668

క. వైరాగ్యము లేకుండిన | వారలు సన్యాసులమని వర్తించినచోఁ
    బేరునకె గాక మోక్ష వి | చారమునకుఁ గాదు సుమ్ము సంయమిచంద్రా.669

తే.గీ. వేదములయందుఁ జెప్పిన విధులఁబట్టి | నలుఁబదెన్మిది సంస్కారములు గదయ్య
    యందు నలుబది యొప్పు గృహస్థునకును | నెందుజూచిన సన్యాసి కెనిమిదయ్యె.670

తే.గీ. శమదమాదులయవిసుమ్ము జగమునందు | నాశ్రమము నుండి యాశ్రమం బందవలయు
    దీనిఁ దెలసిన మోక్షంబు మానకబ్బు | సంయమికుమార యొండు విచార మేల.671

వ. అనిన విని యొక్కింత తడవు తనలో విచారించి పరమవైరాగ్యశీలుండైన మునిబాలుండు
    జనక భూపాలున కిట్లనియె.672

తే.గీ. హృదయసీమను వైరాగ్య మిమిడినపుడు | జ్ఞానమనునది చక్కగా గలిగినపుడు
    శమదమాదులు క్రమలీల జరుగునపుడు | పృథివిలోఁ దప్పదో పెండ్లి పెద్దగొండ్లి.673

వ. అనిన జనకుండిట్లనియె. ఓ మునికుమారా! ఇంద్రియంబులు బలిష్ఠంబులు, వాని లోఁబరచుకొనుట
    కష్టసాధ్యంబు. అపక్వంబులై యవి యనేక వికారంబులు సేయుచుండు నవి యెట్టివియన
    భోజనేచ్ఛయు, సుఖేచ్ఛయు, బుత్రేచ్ఛ మొదలగునవియు యని యెఱుంగుము. అవి యతికిం
    గలిగెనేని యెట్లు సమకూరు? సమకూరుకున్న గాంక్షాశాంతి యెట్లు? కావున నింద్రియేచ్చా
    శమనంబునకుంగాఁ గ్రమక్రమంబుగ నాశ్రమంబునుండి యాశ్రమంబున కెక్కవలయు నెట్లనిన,
    పిపీలికావృక్షశాఖారోహణన్యాయంబు నవలంబింపందగు లేకున్న శ్రాంతి వాటిల్లు, మనుజుని
    మనంబు దొంగగొడ్డు వంటిది. సులభంబుగ వశంబుగాదు. క్రమాభ్యాసంబున వశంబుఁజేసికొనుట
    పరమోపాయంబు.