పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/129

ఈ పుట ఆమోదించబడ్డది

86

శ్రీ దేవీ భాగవతము


ఆ.వె. ముద్దుమోముతోడ మురిపెంపు నగలతో | వన్నెచీరెఁగట్టి కన్నులార్చి
    నగలనిండఁదాల్చి మగువలతో మహా | లక్ష్మి చిఱుతనగవు లగ్గుసూపి.571

వ. ఇట్లు తనయెదుట మహాలక్ష్మిరూపంబున విభ్రమంబులు సూపుచు నిలచియున్న
    దేవిం గాంచి యవ్వటపత్రశాయియగు నారాయణబాలకుం డచ్చరువడి యవ్వరవర్ణిని కనుంగులై
    తోడఁ జనుదెంచిన శ్రద్ధను, మేధను, రతినీ, భూతిని, బుద్ధిని, మతినిఁ, గీర్తిని, స్మృతిని, ధృతిని,
    స్వధను, స్వాహను, క్షుధను, నిద్రను, దయను, తుష్టిని, పుష్టిని, క్షమను, లజ్జను, జృంభను,
    తంత్రను, సాయుధల సాభరణల ముక్తామాలికావిరాజితలం గనుఁగొని యీ యేకార్ణవంబున నిట్టివా
    రెట్లు లుద్భవిల్లిరో నిరాధారులై యెట్లు నిలచిరో యని విస్మయావిష్టహృదయుండై.572

క. ఏ నెట్టుల వటపత్రశ | యానుఁడనై యుంటి నిచట నతివలు వీరల్
    రా నై రెట్టులో తెలియదు | నేనూరక యుందుఁగాక నీటఁ దిరుఁడనై.573

వ. అని మఱియు వ్యాసుండు.574

-: దే వీ భా గ వ తో త్ప త్తి :-



ఆ.వె. అట్టి విష్ణుఁజూచి యా మహాలక్ష్మి దా | నిట్టులనియె మిగులఁ గృపఁదలంచి
    వెఱ్ఱితన మిదేల మఱ్ఱాకు పై నున్న | కుఱ్ఱ జగము జీవగఱ్ఱ దేవి. 575

క. ఆ శక్తి ప్రభావంబున | లేశంబును నన్నెఱుంగలేవైతి జగ
    న్నాశముల మరల మరల మ | హేశుఁడ వై బహుభవంబు లెత్తుటకతనన్.576

తే.గీ. శక్తి నిర్గుణ లేదందు సందియంబు | మనము సగుణుల మాశక్తి తనదు సత్త్వ
    గుణముచే నన్నుఁ బుట్టించెఁ గూర్మి బ్రహ్మ | బుట్టు నీపొక్కిటను జగంబులు సృజింప.577

తే.గీ. అతఁడు రాజసుఁ డతని క్రోధాగ్నివలన | బొమలనడుమను బుట్టు నప్పురహరుండు
    తామసినిగూడి లోకప్రతాన మడఁచుఁ | గాన నేవచ్చితిని నిన్నుఁ గలియుటకును.578

తే.గీ. సమ్మదమ్మున నిమ్ము నీ ఱొమ్మునాకు | నిమ్ముసేసుక యుందు నీ సొమ్మయగుచు
    కమ్మవిలుకానికిని జననమ్ముగలుగు | నమ్ము నామాట లివియు నిక్కమ్ములనుచు.579

వ. అనిన విని ముదితాంతరంగుండై గరుడతురంగుండు.580

తే.గీ. వింటి శ్లోకార్థమొక్కటి విస్ఫుటముగ | నోవరారోహ యెవ్వరి యుక్తియొక్కొ
   యారహస్యంబు పరమాద్భుతావహంబు | తెలియఁజెప్పుము నాకు సందియముదీఱ.581

చ. అది విని లక్ష్మి యిట్లనుఁ బ్రియంబుగ మోమున మొల్కనవ్వు సొం
    పొదవఁగ నోచతుర్భుజ మదుక్తియ యయ్యది వేఱుగాదు మో