పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/110

ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

67


    విమలమనీషులై వినుఁడు వీనులపండుపుగాఁగఁ దొల్లి వి
    భ్రమవతి యా బృహస్పతికి భామిని తార యనంగ నొప్పెడిన్. 357

క. ఆ వనిత మిటారములకు | తా వని తన నేర్పుసూచి తా మెచ్చును వా
    ణీ వనిత మగఁడు కొఱతలు | లేవని తరుణామృతాంశులేఖకుఁ బోలెన్. 358

ఉ. చేరెడు చేరే డా కనులు జిప్పిలి వీనుల నంటు నక్కురుల్
    బారెడు బారెడై వెనుక ప్రక్కను బిక్కలరాయ ద్రేలు సొం
    పారెడుఁ బారెడున్ సుధలపారముగా నధరంబునుండి ము
    ద్దూరెడు దూరెడు న్మొగ మహో తగు పున్నమనాఁటి చందురున్.359

ఉ. కారు మెఱుంగొ బంగరు చొకారమొ వెన్నెల సోగయో సుధా
     ధారయొ కాక పూవిలుఁతు దారయొ నిద్దపుఁ బద్మరాగ శో
     భారమణీయకందళమొ భాసుర దుగ్ధసముద్రవీచియో
     నారుచిరాంగి యొప్పె మదనప్రభన న్నవయౌవనంబునన్.360

మ. మదవైహ్వల్యమునన్ వరాంగి శశిధామంబుం బ్రవేశించి త
     ద్వదనంబుం గని రూపయౌవనకళావర్ణ్యుండు వీఁ డంచు స
     మ్మద మారం దనుఁ గూడు మన్నఁ దమినాతం డియ్య కోల్సేయ న
     మ్మదన ప్రక్రియఁ గొంతకాలము రమింపం జొచ్చి రా యిర్వురున్.361

క. గురుఁ డత్యంత క్రోధ | స్ఫురితుండై తారఁ దేర శుశ్రూషల బా
     లుర బంపినఁ బలుసారులు | మరల మరలఁ దిరిగి తిరిగి మానిరి వారల్.362

క. అందునకుం గడుఁ జింతిలి | బృందారక గురుఁడు దాన యేగెదనని యా
     చందురుని గృహము సేరి య | మందక్రోధమునఁ బలికె మందా యనుచున్. 363

తే.గీ. కర్మ ధర్మ విగర్హితక్రమము పూని | సిగ్గొకింతయు లేక నా శిష్యుఁడ వయి
      నాదు చక్కనిచుక్క నిన్నాళ్ళు నీవ | యతికికొంటివి యెంత సేసితివి చంద్ర.364

క. గురుభార్యనుఁ గవయుట భూసురుఁ జంపుట ధనముగొనుట సురద్రావుట పెం
     పరి యిట్టి వారిఁ గలయుట | యరయంగా నైదునున్ మహాపాతకముల్. 365

క. పెడత్రోవం దొక్కితి వీ | యెడ నిందార్హుఁడవ కావో యీ వోరి శశీ
     విడువుము నా పెండ్లామును | గుడువఁ దగదు తగదు పరమకుత్సితమతివై.366

క. నాచక్కని ముద్దియ నీ | నీ చక్కిని విడువకున్న నేఁ బోవఁ జుమీ
     నీచుఁడవు గురుద్రోహివి | యై చరియించు టిది నీకు నర్హం బగునే. 367