పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/107

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

శ్రీ దేవీ భాగవతము


క. అయ్యో యే మందము మన | దయ్యముఁ దనుఁ గట్టఁ ద్రాఁడుఁ దానిచ్చుటకై
   యియ్యకొనినట్టి చందం | బయ్యెన్ మన మింక నేమి యనఁగల మనుచున్. 324

వ. దానవులు డోలాయమానమానసు లై యివ్విధంబునం గొండొకపడి చింతించి హరిం గని.325

క. లోకైకవీర ముందుగ | మాకును వర మిత్తు ననుచుఁ బల్కితివికదా
   శ్రీకాంత సత్యవాదివి | మా కోరిన వరము నిమ్ము మాన్యమనీషన్.326

ఆ.వె. జలము లేని యొక్క స్థలమున మమ్ములఁ | బొలియజేయు మనినఁ బురుషసింహుఁ
   డైన యచ్యుతుం డనూనప్రభాచక్ర | మైన చక్రము హృదయమునఁ దలఁచి.327

శా. ఓ రక్షోవిభులార రం డిఁకను మిమ్ముక్కార్తు నక్షీణ దు
   ర్వారప్రౌఢిమనంచు నూరుల నరూపారోపరివ్యాప్తి మైఁ
   బారంజూచి జలంబు లే దిచట నొప్పం బోరఁగా వచ్చు నాన్
   వారు న్మేనులు పెంప నూరువు లతివ్యాప్తంబులం జేయుచున్.328
 
క. తన యూరువులం దిడికొని , దనుజేంద్రుల తలలు డుల్లి తటుకునఁ దూలన్
   వనజాక్షుండు చక్రముచే | దునిమెను సుర లొంది రది కనుంగొని వేడ్కన్.329

తే.గీ. వారి మేదస్సుచే నిండె వారిరాశి | యదియ భువి యయ్యె మేదిని యనుచు భూమి
   కభిదగల్గిన కారణం బదియ నుండు | కావుననె మృత్తికను దినఁ గాదటండ్రు. 330

క. నను నడిగిన యది దెలిపితి | మునులారా సర్వలోకములకున్ ఘనపూ
   జనభాజన శక్తియకా | యనుమానము లేదు సత్య మది సత్యమగున్. 331

ప. అనిన విని.332

-: వ్యా స కృ త త ప శ్చ ర్య :-


ఆ.వె. ఋషులు సూతమౌని నీక్షించి పల్కిరి! యనఘ మున్ను మాకు నమరఁజెప్పి
    యుంటి వ్యాసముని మహోత్తమంబగు భాగ వతముఁ జేసె శుకుడు పాడె ననుచు.333

క. వ్యాసుఁడు తప మేలాగునఁ | జేసెను శుకుడెట్లు పుట్టెఁ జెప్పవె మాకున్
    గాసంత విడువ కత్యు ల్లాసంబునఁ వ్యాస వాగ్విలాసము మీటన్. 334

ఉ. నావుఁడు సూతుఁ డెంతయు మనంబున బొంగి మునీంద్రులార మీ
    కే వినుతున్ శుకప్రభప మిప్డు సవిస్తరభంగిఁ దొల్లి య
    ద్దేవగిరీంద్ర శృంగముస దివ్య తపః స్థితి నేకమాతృకా
    దేవి వచస్సుబీజము నుదీర్ణత వ్యాసుఁడు దా జపించినన్.335