పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకు

శ్రీమత్త్రికూటాచల క్షేత్రము


‘కోటప్పకొండ' అనబడు నీ క్షేత్రము గుంటూరుజిల్లాలోని నరసరావు పేట తాలూకాకు దక్షిణమున నేడు మైళ్ళ దూరములో నున్నది. దీని చుట్టుకొలత 'అడుగు తక్కువ యామడ' యని వాడుక. కాని యాఱుమైళ్ళుండవచ్చును. దీని యెత్తు 1587 అ. లు. వైశాల్యము 1500 ఎకరములు. ఇప్పుడెల్లరును బూజించు కోటీశ్వర స్వామి దేవళము 600 అ. ల యెత్తునఁ గలదు. దీని కెగువభాగమున 'ప్రాఁత కోటప్ప గుడి' కలదు, ఓపిక గలవా రచటికి వెళ్ళివత్తురు.


సోపాన మార్గములు :

ఈ కొండ నెక్కుటకు మూఁడు సోపాన మార్గములు కలవు. (1) పూర్వము నరసరావుపేట రాజాగారి యొంటె లెక్కు పడకదారి, ఇది పైనిగల పాపనాశన స్వామి గుడికి క్రిందుగఁ బోవును (2) ప్రస్తుత మందఱు నెక్కి పోవు దారి. దీనిని 120 ఏండ్ల క్రిందట నిప్పటి జమీందారుగారి ముత్తాతగారు కట్టించిరందురు. (3) రాధాకృష్ణ సోపాన మార్గము. రెండవదారికి కుడిప్రక్కను గలదు.


దొనలు :

ఇందు దైవనిర్మితము అయిన దొన లెన్నియో గలవు. ప్రస్తుత దేవాలయ మున కెగువ నున్న యెనిమిది దొనలలో పెద్దవానియందు యాత్రికులు స్నాన మాడుదురు. ప్రాఁత కోటప్ప గుడికిఁ బోవు త్రోవలో 'ఎద్దడుగు' ఆను దొన యన్వర్థసంజ్ఞతో నొప్పును. బసవేశ్వరుఁ డచ్చట తపస్సుచేసె నందురు. ఇంకను ‘పుఱ్ఱచేతి దోన' - 'ఉబ్బులింగము దొన' మొదలగున వెన్నియో కలవు. ఇవి గాక ఋష్యాదులకు తపోయోగ్యములగు గుహ లెన్నియో గలవు.


త్రికూటాచల నామము :

ఈ పర్వత మే వంకనుండి చూచినను మూఁడు కూటములు (బోళ్ళు) గఁ గన్పట్టును. అదియే దీనికి 'త్రికూట పర్వత మనియు, నిందుఁ గల దేవునికి