పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/159

ఈ పుట ఆమోదించబడ్డది

124

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


శీఘ్రకాలంబునందు నశేష వాంఛ
లొసఁగి దుర్జనకృత బాధ లొందకుండఁ
జేసి ప్రత్యక్షముగఁ జూపు శివుఁడు భక్త
పోషి కోటీశుఁ డిష్టముల్‌ పొసఁగ నిచ్చు. 187

కోటీశార్చన సత్ఫలంబు సుమనః కోటీశతం బొందదే ?
కోటీశానునిఁ గొల్చినన్ దనలస త్కోటీశుఁడై యుండఁడే ?
కోటీశస్తుతిఁ జాతురంగికచమూ కోటీశతల్‌ గల్గవే ?
కోటీశుండె చరాచరాత్మక జగత్కోటీశుఁ డెంతేనియున్. 188

సంతరింపరాని సంసార విభ్రమ
భయమడంచి దుష్టపదము బాపి
బ్రోచు కోటిలింగమూర్తిని గొల్తురు
భక్తు లాత్మయోగ భజనులగుచు. 189

సర్వోపద్రవ తాపరోగ భయ కృజ్జాడ్యంబులం బాపుచున్‌
సర్వారిష్ట దరిద్ర శాత్రవ వినాశం బొప్పగాఁ జేయుచున్‌
సర్వానందము లిచ్చు మృత్యుహరుఁడౌ సర్వజ్ఞుఁ గోటీశ్వరున్‌
గీర్వాణాసుర సిద్ధసాధ్య మనుజుల్‌ కీర్తించు టాశ్చర్యమే ? 190

అమ్మహాదేవుఁ గోటీశు నజ్ఞులైన
తజ్ఞులైనను సర్వశాస్త్రజ్ఞులైన
మూర్ఖులైనను భ క్తిచేఁ బూని తలఁప
సకల సిద్ధులు గల్గును సత్యముగను. 191

కరుణావారిధియై, జగత్త్రితయ రక్షాశాలియై సేవకా
మరభూజంబయి, చిన్మయంబయి, మహామాయాంధకార ప్రభా
హరణార్కద్యుతియై, స్వభక్త జనతాయాపక్షయాపాదియై
పరమాత్ముండగు కోటిలింగము మదిన్‌ భావింపఁగాఁ జెల్లదే? 192