పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/120

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము

తృతీయాశ్వాసము

−◆◇◇◆−



శ్రీకంఠ భక్తవత్సల
లోకాధిప వినుత సర్వలోకాధీశా
రాకేందుకోటి భాస్వర
ప్రాకట గంగోత్తమాంగ పర్వతలింగా! 1
 
అవధరింపుము దేవ చిదంబరాఖ్య
నటన తంత్రంబులోన విస్ఫుటము గాఁగ
చెప్పఁబడిన త్రికూటాఖ్య శిఖర మహిమ
మాంధ్ర కృతిఁ జేసితిని నీకు నర్పణముగ.2

ఇంక బ్రహ్మశిఖర మహత్వంబును తన్మధ్యస్థ నూతన కోటీశలింగ సమీపస్థ
లింగంబులం గలియుగాది వచ్చోట ముక్తులగు సాలంక భక్తపుంగవాభీర
కన్యావతంసంబుల కథావిధానం బవధానంబున నేర్పరించి విన్నవించెద
నదెట్లనిన. 3
 
అచ్చటి బిల్వకాననము లచ్చటి నిర్మల ద్రోణికాచయం
బచ్చటి నిర్ఝర ప్రతతు లచ్చటి గైరికధాతు భాసనం
బచ్చటి దివ్య కందరము లచ్చటి సిద్ధ మునీంద్ర మండలం
బిచ్చఁదలంపఁ జెప్పఁ దరమే పరమేష్ఠికినైన నెంతయున్ , 4

ఆచటి కోటీశ్వరాలయం బద్భుతంబు
శ్రాంత హరి రథ్య ఖుర సమాక్రాంత శాత
కుంభ కుంభావళీ ప్రోత్థ గురుతరాగ్ర
గోపురాధఃకృతస్ఫార గోపురంబు. 5