పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/102

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

69


విరియబోసిన జటావిసరంబు కెంజాయ
          సాంధ్యరాగ ప్రభాసరణిగాఁ గ
నీల నీలాంబుజ నీలకంధర కాంతి
         లలితాంధకార సంకలనగాఁగ
నాట్యవేగ విలోల నాకాపగావళీ
          శీకరంబులు నుడుశ్రేణిగాగ
నతిసంభ్రమోద్భూత వితతాట్టహాసంబు
         కమనీయ చంద్రికాకాంతిగాఁగ
తన ప్రదోష తాండవకేళి తగఁ బ్రదోష
కాల సామ్యతఁ బూన లోకాళిబ్రోవ
నృత్తమొనరించు సంధ్యల చిత్తజారి
య మ్మహాశైల కూటత్రయంబునందు.129

వాణీశ్వరుఁడు తాళవాదనం బొనరింప
          వాగ్దేవి వల్లకి పాటఁ బాడ
విబుధాధినాథుండు వేణువు పూరింప
          గానంబు గావింప గమలసద్మ
మర్దలధ్వానంబు మధువైరి పొసఁగింప
          వీక్షింపఁ బరశక్తి సాక్షియగుచు
ప్రమథాళి దేవతాపంక్తియు జుట్టును
         నటనంబుఁ జూచి యానందమొంద

పరమశివుఁడు ద్రికూటాఖ్య పర్వతాగ్ర
శిఖరములయందు నాట్యంబు సేయుచుండు
నదియు బ్రమథైకవేద్యమౌ నవని జనులు
కక్షి గమ్యంబు గాకుండు నద్రితనయ! 130