పుట:శృంగారశాకుంతలము.pdf/45

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

7

క. శృంగారము ముఖ్యంబగు
     నంగియు నంగములుఁ దలఁప [1]నన్యరసములు
     న్సాంగ మగునేనిఁ డంకము
     బంగారముతోడి యొర ప్రబంధము వొందున్.25
గీ. కథప్రసిద్ధయు మిగులశృంగారవతియుఁ
     బరిగణింపంగ శ్రీమహాభారతమునఁ
     గథితయైన శకుంతలాఖ్యానభంగి
     నది ప్రబంధంబుఁ జేయు ప్రఖ్యాతినొంద.26
సీ. [2]సరపువ్వులుగ మాలకరి పెక్కుతెఱఁగుల
                    విరుల నెత్తులుగఁ గావించినట్లు
     కర్పూరకస్తూరికావస్తువితతిచే
                    శ్రీఖండచర్చ వాసించినట్టు
     లొడికంబుగా గందవొడికి నానాసూన
                    పరిమళంబులు గూడఁ బఱచినట్లు
     సరఘలు వివిధపుష్పమరందల
                    వములు గొనివచ్చి తేనియఁ గూర్చినట్లు
తే. భారతప్రోక్తకథ మూలకారణముగఁ
     గాళిదాసుని నాటకక్రమను కొంత
     తావకోక్తికి నభినవశ్రీ వహింపఁ
     గూర్మిఁ గృతి సేయు నాకు శాకుంతలంబు.27
వ. అని సవినయంబుగాఁ గర్పూరతాంబూలంబు జాంబూనదపాత్రంబున
     నర్పించి ప్రార్థించినఁ దద్వచనప్రకారంబున మిశ్రబంధంబుగా శాకుం
     తలం బను ప్రబంధంబు బంధురప్రీతిం జెప్పఁబూనితి నేతత్ప్రారంభంబు
     నకు మంగళాచారంబుగాఁ గృతినాయకుని వంశావతారం బభివర్ణించెద.28

  1. నష్ట
  2. సరవిపూల్గల