పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xvi

యొకధోరణిలోనివి. ఒకయూరును ఒక రాజు ఏలెను. అతఁడు వేటకుఁబోయెను. ఒక కన్యకను చూచెను.ఉభయులకు విరహతాప మయ్యెను. శైత్యోపచారములు జరిగెను. చచ్చునంతపనియై యెటులో యుభయులకు సమాగమమయ్యెను. వారి పెండ్లియు నిషేకమును నయ్యెను. ఇది కథ. మధ్యమధ్య నష్టాదశవర్ణనలు నింపుట. స్త్రీవర్ణన యొకేమాదిరిగా నుండుట. ఇదంతయు కవుల భావదౌర్బల్యమును, క్షీణదశను తెలుపునట్టిది. ఒకదిక్కున అప్పకవి యపూర్వనిబంధనలు చేయుచుండ నదేకాలమందు మరొక దిక్కు కదిరీపతి యానిబంధనలను తృణీకరించి స్వతంత్రుండై కబ్బమును రచించెను.

తెనుఁగులోఁ గథలు వ్రాసినవారు వ్రేళ్లమీఁదిలెక్కవారు. పింగళసూరన, మంచెన, వేంకటనాథుఁడు, జక్కన, కేతన, గోపరాజు, అన్నయ, కదరీపతి, అయ్యలరాజు నారాయణకవి కథలను వ్రాసినట్టివారు. వీరందఱును చక్కగా రచించినవారే. అందులో మంచెన, కేతన, కదిరీపతి రచనలే యుత్తమమైనట్టివి.

ఉ. కారుమెరుంగు రాచిలుక, కస్తురివీణ, పదారువన్నెలం
    గారము, రస్తుకుప్పె, తెలిగంబుర, వెన్నెలలోని తేట, యొ
    య్యారపుఁడెంకి, యందముల కన్నిటికిం దగుపట్టుగొమ్మ, సిం
    గారపు దొంతి, యైనకులకాంత నయో యెడబాయనేర్తునే.(1 వ కథ)

అనుచో నచ్చతెనుఁగుపదాలకూర్పు నెంతసొగసుగాఁ గావించెనో గమనించుఁడు.

సీ. పా. మంజులద్రుమలతాకుంజపుంజస్థలీ
    ఘుటఘుటార్భటిలుఠత్కిటికులము(2వ కథ)