పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/6

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయముద్రణము 1930లో జరిగినది. ద్వితీయ ముద్రణ పీఠికలో అప్పటి కించుమించు 12 ఏండ్లకు పూర్వము ప్రథమముద్రణము జరిగినట్లున్నది. తృతీయ ముద్రణ మెప్పుడు జరిగినదో తెలియదు. మొదటి రెండు ముద్రణములకును శివరాత్రిమాహాత్మ్యమును తొలిసారిగా పరిష్కరించిన విద్వాన్ శ్రీ కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రిగారి రెండు పీఠికలున్నవి. మూడవ ముద్రణమున గూడ మరల ఆ రెండు పీఠికలే ముద్రితములైనవి. ఆనాడు వారికి లభించినది నాలుగాశ్వాసముల గ్రంథమే కనుక శ్రీనాథు డంతే రచించియుండునని యూహించి శ్రీ సాంబమూర్తిశాస్త్రిగారు తమ పీఠికలో నటులే వ్రాసినారు. ఒకటి రెండక్షరములు శిథిములైన చోటులు పూరించియు మిక్కిలి శిథిలములైన భాగములు చుక్కల గుర్తులుంచియు గ్రంథమును ముద్రించినారు.

అటు తరువాత శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సంపాదించి పంపగా శివరాత్రిమాహాత్మ్యమునకు మూలమైన ఈశాన సంహితను గూడ శ్రీ సాంబమూర్తిశాస్త్రిగారే ఆంధ్ర సాహిత్య పరిషత్తు 44వ ప్రచురణముగా విపులమైన పీఠికతో ప్రకటించినారు. శివరాత్రిమాహాత్మ్యమును శ్రీనాథుడు నాలుగాశ్వాసములుగనే వ్రాసినట్లు శ్రీ సాంబమూర్తిశాస్త్రిగారును, సంపూర్ణముగా వ్రాసినట్లు శ్రీ బండారు తమ్మయ్యగారును వాదించుకొన్నట్లు వారి పీఠిక మూలమున తెలియుచున్నది. మీదు మిక్కిలి సంస్కృతమున నున్న ఈశానసంహితయే శ్రీనాథుని శివరాత్రిమాహాత్మ్యమున కనువాదమని శ్రీ సాంబమూర్తిశాస్త్రిగా రభిప్రాయపడినారు. ఇంకను శివరాత్రిమాహాత్మ్యమందలి అవతారికాభాగమును, ఆశ్వాసాంతములును శ్రీనాథవిరచితములు కావనియు కృతిపతియో తదాశ్రితుడో ఈ పని చేసినట్లు వారు తీర్మానించినారు. ఆయా భాగములందలి దోషములను అప్రౌఢకవితాబంధములను ఇందు కుపబలకముగా నుదాహరించినారు. భట్టబాణుని కాదంబరీవచనముల నే తీరుగా శ్రీనాథుడు శివరాత్రిమాహాత్మ్యమున అనుసరించినాడో నిరూపించినారు. ఇందు కాంధ్రసాహిత్యలోక మెంతయు వారికి ఋణపడియున్నది.

సమగ్రతాళపత్రగ్రంథము:

ఇన్నాళ్ళకు శివరాత్రిమాహాత్మ్యము సంపూర్ణప్రతి లభించుట మన యదృష్టము. తెలంగాణమందలి మెదకు మండలము అందోలు తాలూకా దన్నారం గ్రామవాస్తవ్యులైన శ్రీ శంకు శంకరప్పగా రీతాళపత్రగ్రంథమును నా కిచ్చినారు. శ్రీ సాంబమూర్తిశాస్త్రిగారికి లభించిన ప్రతి కూడ తెలంగాణకు చెందినదే. ఇతరాంధ్రప్రాంతములందువలె తెలంగాణమున తాళపత్రగ్రంథముల సేకరణ జరుగలేదు, ఇప్పటికిని ప్రాచీనగ్రంథములు తెలంగాణమున లభించుననుట కీ శివరాత్రిమాహాత్మ్యమే సాక్ష్యము. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక (సంపుటి 54-సంచిక 3) లో పాల్కురికి సోమనాథుని క్రొత్తరచనము పండితారాధ్యోదాహరణము ప్రకటించితిని. తెలంగాణమున కొన్ని ప్రాచీనవీరశైవమఠము లున్నవి. ఆయా మఠములందు నేలగాబులలో నూర్లకొలది తాళపత్రగ్రంథములు గడ్డ కట్టుకొనిపోవుచున్నవి. వాని నుద్ధరించు నాథుడు లేడు. ఇప్పటికే కడచిన ఇరువది ముప్పదేండ్లలో కొన్ని యమూల్యగ్రంథములు మనకు శాశ్వతముగా దక్కకుండ పోయినవి. మా యింటినుండి శ్రీనాథుని శాలివాహనసప్తశతి పోవుట నే నెరుగుదును. పూర్వసంస్థానాధీశ్వరుల కడను కొందరు వ్యక్తులవద్దను పోయినవి పోగా మిగిలియున్న గ్రంథములనైనను సేకరించి ప్రాచ్యలిఖితపుస్తకభాండాగార మొకటి స్థాపించవలెనని ప్రభుత్వమువారికిని ప్రజాసంస్థలకును ఒక దశాబ్దముగా మొరపెట్టుకొనుచున్నాను. కాని యది యరణ్యరోదనమైనది. ఇక కొన్నాళ్ళకు మిగిలిన గ్రంథములు కూడ పాడైపోయిన తరువాత ఎవ్వరును చేయగలిగిన దేమియు నుండదు.

ప్రస్తుతము లభించిన శివరాత్రిమాహాత్మ్యము తాళపత్రప్రతి వయస్సు ఇన్నూరేండ్లకు పైగా నుండును. వ్రాయసకాని పొరపాటులు కొన్ని యున్నను ఇది మిక్కిలి చక్కనిప్రతి. చక్కనిదే కాదు సమగ్రమైన ప్రతి. దీనిలో నైదాశ్వాసము లుండుటే కాక పూర్వముద్రితములైన నాలుగాశ్వాసములందు లేని కొన్ని క్రొత్త పద్యము లధికముగా నున్నవి. పూర్వముద్రణములందలి శిథిలభాగము లన్నియు దీనిలో భద్రముగా నున్నవి. ఇంకను దీనిలో కొన్ని పాఠభేదములు కూడ ఉన్నవి. పూర్వముద్రణములందు దోషజుష్టము లనుకొన్న భాగములు కొన్ని ఈ క్రొత్త పాఠములవలన గుణయుక్తము లగుచున్నవి. ఐనను ఒండురెండు శైథిల్యములు గ్రంథపాతము లిందును లేకపోలేదు. మరియొక ప్రతి యెన్నడైన లభించినచో అప్పు డీ శివరాత్రిమాహాత్మ్యము సమగ్రతరమగును.

పంచమాశ్వాసము:

పూర్వముద్రణములందు లేని పంచమాశ్వాస మిందు గలదు. చతుర్థాశ్వాసాంతమున మునులు సూతునితో “చిన్నవోయి యముం డేమి చేసెఁ బిదప” అని యడిగిన ప్రశ్నకు సమాధాన మీ పంచమాశ్వాసము. ఇందు 91 గద్యపద్యము లున్నవి. శివదూతలవలన తన భటులకు జరిగిన పరాభవమును విన్న యముడు చిత్రగుప్తుని సంప్రదించి తన యశక్తాధికారమునుగూర్చి పరమశివునకే విన్నవింప నిశ్చయించుకొని కైలాసమునకు పోవుట, కైలాసవర్ణనము, శివస్తుతి, సుకుమారుని పాపకార్యములు చెప్పుట, శివుడు సమాధానముగా శివరాత్రిమాహాత్మ్యమును శివభక్తుల లక్షణములను చెప్పుట, యముడు తన లోకమునకు తిరిగి వచ్చి తన భటులకు శివుడు చెప్పినవన్నియు మరల చెప్పుట యిందలి వృత్తాంతము. ఈశాన సంహితయందలి (1-130 శ్లోకములు) చివరి యధ్యాయమున కిది తెలుగుసేత.

అధిక పద్యములు:

పూర్వముద్రణము నాలుగాశ్వాసములలో లేని కొన్ని పద్యములు దీనిలో అధికముగా నున్నవి. అవి యివి.