పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

‘కృతిపతులగు కవిముఖ్యుల’ (I-14) అనునది కృతిభర్తలగు కృతికర్తల (తిక్కనవంటివారి) గురించిన మాట యని భావించవలెను.

శ్రీ సాంబమూర్తిశాస్త్రిగా రెత్తిచూపిన తక్కిన దోషము లివి.

సుతుని న్నుద్యుక్తశాంతాత్మునిన్. (I-1)
పుణ్యఋషీశ్వర సప్తతుల్యులం బోలిన. (I-25)
వైభవప్రఖ్యాత వరహరిశ్చంద్రుండు. (I-26)
ఘనుఁడు కొమరగిరీంద్రుండు కలిగియుండు (I-26)
నేర్పరతడు. (I-28)
పరమపాతివ్రత్యభావంబు తలఁపంగ గౌరి గాఁబోలు నీ కాంత తలఁప. (I-40)
నల్విటు చింత. (I-62)

శాస్త్రిగారు చూపిన యప్రౌఢబంధములే కాక నాకు మరికొన్ని తోచినవి. I-18 వచనమున శాంతభిక్షావృత్తియతి శాంతయ్య కంకితముగా శ్రీనాథుని కృతి రచింపుమని కోరిన సందర్భ మేమాత్రమును అన్వయము సరిగా లేదు. కృతిభర్త వంశావతారమును వర్ణించు పద్యములు కూడ కొన్ని యటులే యున్నవి. I-40 వచనము చివర భాగముకూడ అన్వయము సరిగా లేదు. ఇవి చూడగా కాలక్రమమున పెక్కుదోషము లిందు చేరినవని తెలియుచున్నది. అవతారికలోని కొన్ని పద్యములు మాత్రము (1, 6, 8, 9, 34) తప్పక శ్రీనాథునివే యని చెప్పవచ్చును.

ఇతివృత్తము:

ఈ శివరాత్రిమాహాత్మ్యమునకు మూలము స్కాందపురాణాంతర్గతమగు [1]ఈశాన సంహిత. దానిలో 336 అనుష్టుప్పులందున్న మూడధ్యాయముల కథను శ్రీనాథు డనేక వర్ణనలతో పెంచి ఐదాశ్వాసముల ప్రబంధముగా తీర్చిదిద్దినాడు. ఈ రెంటికి గల పోలికలు భేదములు శ్రీ కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రిగారు ఈశానసంహితకు తాము వ్రాసిన పీఠికలో నిచ్చియున్నారు.

శౌనకాది మహామునులు సూతుని శివరాత్రిమాహాత్మ్యము నడుగ నాతడు ప్రళయాంతమున శ్రీమన్నారాయణుడు క్రోడాకారమున భూమి నుద్ధరించి గర్వముతో క్షీరసాగరమున శయనించుట, నిద్ర మేల్కాంచిన బ్రహ్మ శివానుగ్రహమున మరల సృష్టిచేసి తానే జగత్కర్తనని గర్వించి పాలసముద్రమున పవ్వళించియున్న నారాయణుని కవ్వించుట, విరించి-నారాయణు లహమహమికతో పాశుపతాస్త్రములు ప్రయోగించుట, లోకములు గగ్గోలువడుట, మాఘకృష్ణచతుర్దశీ మధ్యనిశిని శివు డనలస్తంభాకారముగా నవతరించుట, పద్మజ-పద్మాక్షులు దాని యాద్యంతములు పొడగాననేరక శివుని స్తుతించుట, శివుడు వారికి శివరాత్రివ్రతం బుపదేశించుట, తొల్లి యొక శివరాత్రిదర్శనమున మహాపాపియైన బ్రాహ్మణుడు శివలోకమున కేగెనని సూతుడనగా నా కథ వినుపింపుమని శౌనకాదు లడుగుటతో ప్రథమాశ్వాసము ముగియును దండకారణ్యమున రత్నపురి రాజధానిగా హేమాంగదుడను శబరరాజు పాలించుచుండెను. ఆతని మంత్రి యజ్ఞదత్తుడు. యజ్ఞదత్తుని భార్య సుశీల. ఎంతో కాలమునకు పుణ్యోపవాసవ్రత దానధర్మ దేవతారాధనంబుల వలన నామె గర్భము దాల్చుట, దోహదములు, ప్రసూతిగృహవర్ణనము, సుకుమార జననము, జాతకర్మలు, శైశవము, సంస్కారములు, విద్యాభ్యాసము, యౌవనము, దురభ్యాసములు, తల్లిదండ్రుల హితోపదేశము మున్నుగా గలది ద్వితీయాశ్వాసము.

సుకుమారుని దౌష్ట్యము పెచ్చుపెరుగుట, రాజాతని దేశము వెడలనడచుట, సుకుమారుడు కీకటదేశము మీదుగా హూణమండలమున కేగుచు కాంతారమధ్యమున నొక తటాకముకడ సేదదేరుట, అచటికొక చండాలకన్యక స్నానార్థమై వచ్చుట, పరస్పర మోహశృంగారములు, సాయం-నిశావర్ణనములు, సుకుమారుడు భద్రకాళికాస్థానమున నుండి రహస్యముగా చండాలకన్యకతో కాపురము సేయుట, శబరులతోడి సహవాసము, వారి దుర్వర్తనము హూణమండలమున పొక్కుట, ఇరువురును మరియొకచోటికి వెడలిపో నుద్యోగించుట లాదిగా గలది తృతీయాశ్వాసము.

కాళిజాతర, సుకుమారుడు చండాలకన్యకతో కలిసి కిరాతమండలమున వణిక్పథము చేరి బ్రహ్మపురివాడలో కాపురముండుట, సంతానలబ్ధి, చండాలి మరణము, సుకుమారుడు కూతులతో పాపకార్యము చేయుట, వాని దుశ్చేష్టితము లెరిగి యచటివారు ప్రాయశ్చిత్తములు చేసికొనుట, సుకుమారుడు కూతులవలన సంతానము బడయుట, హేమంతవర్ణనము, నాగేశ్వర వర్ణనము, శివరాత్రివర్ణనము. సుకుమారుడు నాగేశ్వరాలయమునకు వచ్చి శివరాత్రిని దర్శించి విగతకల్మషుడై కొంతకాలమునకు మరణించుట, కాలకింకరులు వాని గొనిపోవ వచ్చుట, శంకరకింకరులు వారి నడ్డగించుట, యుద్ధము, వాదోపవాదములు, యము డులుంబరుని మృత్యువును తన కింకరులకు బాసటగా పంపుట, యమభటుల పరాభవము, ప్రమథులు సుకుమారుని కైలాసమునకు గొనిపోవుట, సుకుమారుడు శివుని స్తుతించి,

  1. ఆంధ్ర సాహిత్య పరిషత్ప్రకాశితము-44, కాకినాడ.