పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది


సర్వలక్షణగుణసంపన్నతోన్నతి
          నింద్రాణి గాఁబోలు నిగురుఁబోణి


గీ.

యనఁగ నిద్ధాత్రి నే ప్రొద్దు నతిశయిల్లెఁ
బరఁగ ముమ్మడి దేవయ్య భామ జగతిఁ
[1]గామితార్థైకసంధానకల్పవల్లి
యుజ్జ్వలద్గుణనికురుంబ యొమ్మమాంబ.

40


ఉ.

ముమ్మడిదేవచంద్రునకు ముఖ్యతలోదరి యొమ్మ[2]మాంబకున్
(సమ్మద శైవశాస్త్రపరిసంచిత నిర్మల)శుద్ధ[3]యుక్తికిన్
ఇమ్మహి నెల్లవారలకు నీప్సితవస్తువిధాయియై ధరన్
సమ్మతి నుద్భవిల్లె [4]వరశాంతుఁడు శాంతన [5]యగ్రగణ్యుఁడై.

41


సీ.

పరవాదిమత్తేభపంచాననాఖ్యుఁడు
          పరవాదిమండూకపన్నగుండు
పరవాదినవమేఘపవమానధీరుండు
          పరవాదిసాగరబాడబుండు
పరవాది[6]కుత్కీలభాసురదంభోళి
          పరవాదికేంధనపావకుండు
పరవాదిచయతమఃపటలోగ్రభానుండు
          పరవాదిభోగిసుపర్ణుఁడనఁగఁ


గీ.

జటులజైనకోలాహలసమర బిరుద-
ఘనుఁడు సంగ్రామపార్థుండు వినుతయశుఁడు
శుభుఁడు ముమ్మడిదేవయ్య సుతుఁ డనంగ
వెలసె శాంతయ్య విక్రమవీరవరుఁడు.

42


గీ.

వేడ్కఁ గవిసార్వభౌముని విమలచరిత
స్కాందపౌరాణికంబైన కథలలోన
ఘనత శివరాత్రిచరితంబుఁ దెనుఁగుగాఁగఁ
గరుణఁ జేయుము శ్రీనాథకవివరేణ్య.

43


వ.

అనవుడు నమ్మహీసురాగ్రగణ్యుండు కమలనాభామాత్యపౌత్రుండును మారయామాత్యపుత్రుండును నగు శ్రీనాథకవివరేణ్యుండును [7]సంతుష్టమానసుండై శాంతస్వామి యొసంగిన కర్పూరతాంబూల జాంబూనదాభరణంబులు స్వీకరించి [8]స్కాందంబున నీశానసంహితయందుం జెప్పంబడిన యురులింగోద్భవంబును, శివరాత్రిమాహాత్మ్యంబును, (సుకుమారోత్పత్తియు, యమ-శంకర సంవాదంబును, యమ-శివదూత సంబోధనంబును నను పంచమాశ్వాసానుకీర్ణంబై యొప్పు) [9]కథానిధానంబున కధీశ్వరుఁగా (శాంతదేశికేశ్వరుం బరిగ్రహించి).

44
  1. ము. కామితార్థక
  2. తా. సానికిన్
  3. తా. మూర్తి
  4. ము. ఁబర
  5. ము. వా
  6. తా. కుత్కూట
  7. తా. నగు సంతోష
  8. తా. యందంబుగ
  9. ము. కథావిధానంబున