ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత &
సంస్కృతి సమితి
ఘంటసాల వెంకటేశ్వరరావు
ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల
దుర్గాపురం, విజయవాడ.
డా. దీర్ఘాసి విజయభాస్కర్
ఫలించిన కల
తెలుగులో వచన కవిత్వం క్రీ.శ. 6వ శతాబ్దిలో ప్రారంభమైంది. క్రీ.శ. 9వ శతాబ్దిలో పద్యకవిత్వం ప్రారంభమైనా, శాసనాలను పరిశోధించిన తరువాత గానీ ఈ విషయం వెలుగులోకి రాలేదు. కీ.శే. జయంతి రామయ్య పంతులుగారు, తెలుగు శాసనాల్లో పద్యాలను గుర్తించిన తరువాత నన్నయ కంటే ముందు తెలుగులో కవిత్వం లేదనే వాదన వీగిపోయింది. 1920వ దశకంలో జయంతి రామయ్య పంతులుగారు తెలుగు శాసనాలను సేకరించి, వాటిలోని పద్యాలను గుర్తించి, కాలానుక్రమణికలో శాసనపద్యమంజరి పేరిట 1930లో మొదటి సంపుటాన్ని, 1937లో రెండో సంపుటాన్ని ఆంధ్రసాహిత్య పరిషత్తు ద్వారా ప్రచురించి అందుబాటులోకి తెచ్చారు.
88 ఏళ్ళ క్రితం ప్రచురించిన మొదటి సంపుటం, 57ఏళ్ళ తరువాత పునర్ముద్రణ పొందినా ఈ తరానికి ఆ రెండు సంపుటాలు అందుబాటులో లేవు. చరిత్ర సాహిత్య విద్యార్థులు, పరిశోధకుల విజ్ఞప్తి మేరకు జయంతి రామయ్య పంతులుగారి శాసనపద్యమంజరి రెండు సంపుటాలను కలిపి, ఒకే సంపుటంగా తీసుకురావటానికి చరిత్ర, పురావస్తు పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి, సీఈవో, డా॥ఈమని శివనాగిరెడ్డి పూనుకోవటం ఆనందించదగ్గ విషయం. ఈ సందర్భంగా ప్రచురణ బాధ్యత చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సంస్కృతి సమితి పక్షాన సహసంపాదకులు డా.జి.వి.పూర్ణచందు, డా. కొండా శ్రీనివాసులుగార్లను కూడా అభినందిస్తూ, ఈ పుస్తకం చరిత్ర, సాహిత్యం విద్యార్థులు, పరిశోధకుల ఆదరణ చవిచూస్తుందని ఆశిస్తూ, కీ.శే. జయంతి రామయ్యపంతులుగారిని స్మరించుకుంటూ...
20-07-2018
అమరావతి
దీర్ఘాసి విజయభాస్కర్, సీఈవో