పుట:విక్రమార్కచరిత్రము.pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

46

దీనిని 51వ పద్యము పిమ్మటఁ జేర్చిన బాగుండు నని తోచినది. తర్వాత పద్యము మొదటి సగమును షష్ఠ్యంతముగా నుండి దీనితోఁ గలిపి చదివికొనఁదగియుండుట యిది 51వ పద్యమునకు పిమ్మటఁ జేర్పఁబడినది.

4. ముదిత గ్రంథములో నీ క్రింది పద్యమున యతి భంగము కలదు.

కనుఁగొని నెమ్మనం బలరగాఁ బులిజున్నును నేదుకన్ను దె
మ్మనినను దెచ్చువాఁడఁ బ్రియమైనవి యెల్లను జెప్పుఁడంచు గొ
బ్బున హృదయానువర్తి యయి(?) పల్కును బంతము నొక్కభంగిగాఁ
దనియఁగ నిచ్చు నవ్విభుఁడు తామరసాక్షులు గోరుకోరికల్.(ఆ. 1-169)

ఇందలి తృతీయపాదమున యతిభంగము గోచరించుచున్నది. ఇది సవరింపబడక ప్రశ్న (?) గుర్తు వేసి వదలి వేయఁ బడినది. గొబ్బున అనఁగా శీఘ్రముగా అని యర్ధము. 'గొబ్బన' అని దిద్దిన యతి సరిపోవును. కాని ఈ రూపము గలపదము శబ్దరత్నాకరము నందు లేదు. కాని జక్కన కవి అన్యత్ర 'గొబ్బనయని ప్రయోగించుట గమనింపఁ దగియున్నది.

జనవర! నీ పురోహితుల శాస్త్రరహస్యనిరూపణక్రియా
వనజభవప్రభావులగు వారి ముహూర్తము నిశ్చయింపఁగాఁ
బనుపు “శుభస్య శీఘ్ర" మను పల్కు నిజంబొనరింపు మన్న, గొ
బ్బనఁ బతిచిత్తవృత్తిగని భట్టి విదర్భుఁడుఁ దాను వేడుకన్.(ఆ. 4-134)

కావునం బూర్వ (169) పద్యము నందును దీని ననుసరించి 'గొబ్బన' అని సవరింపఁబడినది.

5. ప్రాస (?) ఈ క్రింది పద్యమును గమనింపుడు.

ఇది శిల వ్రాసిన యది యని
చతురత విప్రుఁడొకఁడు ప్రసంగవశమునం
జదివెను నొగి నీ పద్యము
నది యెఱుఁగఁగవలయు, నచటి కరిగెద భట్టీ! (ఆ. 2-45)

పై పద్యమునందు "దకార 'త' కారములకుఁ బ్రాసము కలదు. త, ద, లు రెండును స్వవర్గాక్షరములు కాబట్టి కొందఱు దీనిని “స్వవర్గజప్రాసము"గా చెప్పవచ్చును. ప్రాసభేధములను జెప్పుచు 'స్వవర్గజప్రాసము"ను చెప్పిన వాఁ డప్పకవి యొక్కడే. అప్పకవి యైనను,