పుట:విక్రమార్కచరిత్రము.pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

45

బ్రోడగు పెద్దయయన్నన
మాడకు మాడెత్త యతని మాటలు జగతిన్.(ఆ. 1-21)

దీనినిఁ బట్టి పెద్దయ పుతుండగు అన్నయ జక్కన జనకుఁ డని స్పష్టపడుచున్నది. కావున ఆశ్వాసాంతగద్యలలో 'పెద్దయ యన్నయామాత్య పుత్ర' యని సవరింపఁ బడినది.

2. కృతిపతి యగు సిద్ధనమంత్రి తాత యగు సూరన సోమయాజికిఁ దనయుఁడని ముదిత గ్రంథములోఁ గలదు.

అమ్మహితాత్ముని తనయుఁడు
సమ్మానదయానిధానసౌజన్యరమా
సమ్మోదితబాంధవుఁడై
యిమ్మహిలో సిద్ధమంత్రి యెన్నిక కెక్కెన్.(ఆ. 1-134)

(వావిళ్ళ ప్రతి. 1926)

దీనికి

“అమ్మహితాత్ముని మనుమఁడు
... ... ... .. ... ... ... (ఆం.క.చ. పుట. 384)

అని పంతులుగారి పాఠము. మనుముం డనఁగా సంతతివాడని పంతులుగారు దీనిని సమన్వయించి, కవితరంగిణికర్తయును 'మనుమం' డను పాఠమునే గ్రహించుటే కాక కొన్ని తాళపత్రప్రతులందును 'మనుమం' డనియే యున్నదని వ్రాసిరి. (క.త..సం. 4. పుట, 218). కావున దీనివల్ల విశేష ప్రయోజనము కనబడకున్నను తాళపత్రప్రతి పాఠమే గ్రంథమున గ్రహింపఁబడినది.

3. పూర్వముద్రితప్రతులలో 5 కందపద్యముల చివర నొక ఉత్పలమాలతో షష్ఠ్యంతములు ముగింపబడియున్నవి. చివరిపద్యము :

“వెన్నెగంటి సూర్యుండు వివేకగుణాఢ్యుఁడు ...." (ఆ. 1-62)

అనునది యీ యుత్పలమాల ప్రక్షిప్త మనియు, నొక వేళ కవియే రచించియుండినచో నిది షష్యంతములలోఁ గాక కృతిపతివంశవర్ణనలోఁ జేరియుండదగిన దనియుఁ గవితరంగిణి కర్త యభిప్రాయము. ఇది చాలవఱకు వాస్తవ మనియే తోచును. ఐదు కందముల పిమ్మట నీ యుత్పలమాల యేల? అందును అంత గొప్ప కవీంద్రకుంజరుని దెచ్చి షష్ఠ్యంతములలోనా యిఱికించుట! ఈ పద్యముయొక్క కూర్పు ప్రక్షిప్త మని తీసివేయరానంతగా దాగున్నది. కాని షష్ఠ్యంతములలో నుంట వంశావలి వర్ణనలో సులభముగాఁ జేర్పరాకున్నది. ఆలోచింపఁగా