పుట:విక్రమార్కచరిత్రము.pdf/266

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

విక్రమార్కచరిత్రము


సీ.

గంగాప్రవాహంబు గాఁబోలు నని వసి
        ష్ఠాదు లనుష్ఠాన మాచరింప
నమృతంబువెల్లువ యని నిలింపాదులు
        మునుకొని దోసిళ్ళ ముంచి క్రోల
దుర్గాంబునిధి యని తోయజాక్షుఁడు శేష
        పర్యంక మిడుకొని పవ్వళింప
బరమేశు విశ్వరూపం బని బ్రహ్మాదు
        లమర దండప్రణామములు సేయఁ


తే.

దలఁప భూనభోంతరములకొలఁది దెలిసి
బెరసి యెన్మిదిదిక్కులఁ బొరలి పొరలి
దట్టముగ నంతకంతకుఁ దనరి తనరి
యిట్టలంబుగ వెన్నెల నిట్టవొడిచె.

69


వ.

అంత.

70


సీ.

పసగల వెన్నెలమిసిమి పుక్కిటఁ బట్టి
        పొసఁగఁ బిల్లలనోళ్ళఁ బోసి పోసి
నున్ననిక్రియ్యన్కు వెన్నెలతుంపరల్
        హుమ్మని చెలులపై నుమిసియుమిసి
కమ్మనివెన్నెల కడుపునిండఁగఁ గ్రోలి
        తెలివెక్కి గఱ్ఱనఁ ద్రేన్చి త్రేన్చి
కన్నిచ్చలకు వచ్చు వెన్నెలక్రొన్నురు
        వేఱి వే ప్రియురాండ్ర కిచ్చియిచ్చి


తే.

తఱచువెన్నెలగుంపులఁ దాఱితాఱి
యీఱమగు వెన్నెలలలోనఁ దూఱితూఱి
పలుచనగు వెన్నెలలలోనఁ బాఱిపాఱి
మెలఁగెఁ బెక్కుచకోరంపుఁబులుఁగుగములు.

71


వ.

ఇవ్విధంబున సాంద్రం బైనచంద్రాతపంబున నరేంద్రుం డతంద్రుండై, హయంబు రయంబునకు మెచ్చుచు నతిదూరం బరిగి, వేకువయగుటయు