పుట:విక్రమార్కచరిత్రము.pdf/26

ఈ పుట ఆమోదించబడ్డది

25

మఱియు దానికి కథాసరిత్సాగరము నందలి విక్రమకేసరికథ మూల మనియు, మఱియు మనుచరిత్ర కథకు మార్కండేయపురాణ మెట్టిదో మల్లన రాజశేఖరచరిత్రకు, జక్కన విక్రమార్కచరిత్రము నట్టిదే యని తెలుపుటయే యింతవఱకుఁ గావింపఁబడిన కథావిషయవివరముయొక్క ముఖ్యోద్దేశము.

జక్కన చేసిన ప్రబంధవర్ణనలు

ఈ విక్రమార్కచరిత్రము నద్భుతావహము లగు ననేకకథలచే నాకర్షవంతముగఁ జేసి నవరసభరిత మొనరించి యాస్వాదనీయముగ నొనరించుటే కాక జక్కన దీనిని నానావిధవర్ణనాదులచేఁ గడు మనోహరము గావించెను, ఇపు డిందలి వర్ణనములను గూర్చి కొంత దెలుపఁబడును.

"నగరార్ణవశైలర్తు చంద్రార్కోదయ వర్ణనమ్
ఉద్యానసలిలక్రీడా మధుపానరతోత్సవాః
విప్రలంభోవివాహశ్చ కుమారోదయవర్ణనమ్,
మంత్రద్యూత ప్రయాణాజి నాయకాభ్యుదయా అసి.
ఏతాని యత్రవర్ణ్యంతే తన్మహాకావ్యముచ్యతే.
ఏషామష్టాదశానాంయైః కైశ్చిదూన మసీష్యతే."

మహాకావ్య, మహాప్రబంధముల యందుఁ బై యష్టాదశవర్ణనములలో నన్నిగాని, కొన్ని తక్కువగఁ గాని యుండవలె నని యాలంకారికుల మతము. విక్రమార్కచరిత్రము నందు జక్కన యించుమించుగా నుపర్యుక్తవర్ణనముల నన్నిఁటినిఁ జేయుట మాత్రమే కాక సందర్భానుసారముగ నితర సాధారణవర్ణనము లనేకములు నిందుఁ జేర్చినాఁడు. అట్టి ప్రధానాప్రధానవర్ణనలకు గ్రమముగా గ్రంథసందర్భములు దిగువఁ జూపఁబడుచున్నవి.

అష్టాదశవర్ణనములు :

1. పురవర్ణనము :- మధురానగరవర్ణనము నీకవి యత్యంతాసక్తితో సుమారు 37 పద్యములతో గావించినాఁడు. (ఆ. 1. 64-100)

ఇంతటితోఁ దనివిసనక తర్వాతిదగు దీర్ఘవచనము (ప. 101) చేతను మధురాపురిని సాంగోపాంగముగ వర్ణించెను. ఈ వచనమునందు బాణుని కాదంబరి శైలి ననుసరించి శ్లేషానుప్రాణిత మగు ఉపమా, విరోధాభాసాద్యలంకారాదులు హృద్యముగాఁ గూర్పఁబడినవి. సంస్కృతగద్యకావ్యములు జటిలదీర్ఘసమాసఘటితములయి యర్థావబోధమునఁ బండితులకే క్లేశదాయకములుగ నుఁడుటచేఁ గాబోలు; ప్రాచీనాంధ్రకవు లట్టివాని ననువదించుటకుఁ గానీ, యట్టి గద్యకావ్యము