పుట:విక్రమార్కచరిత్రము.pdf/25

ఈ పుట ఆమోదించబడ్డది

24

నుద్దేశింపఁ బడినవి. ఈ రెంటి చివఱను శుకశారికల వివాదమునఁ బుట్టిన రెం డనుబంధకథలు నొకేవిధమునఁ గలవు. ఇఁక కథాసరిత్సాగరము నందలి కథానాయకుఁడు విక్రమకేసరి యని యుండగా జక్కన కథానాయకునకు రాజశేఖరుఁ డను క్రొత్తపే రిడి, 'విక్రమకేసరి' నామము నతని జనకున కొసఁగె ననుట యూహ్యము. నాయకుని యొద్ద దివ్యజ్ఞానము గల చిలుకయు, నాయిక యొద్ద నట్టిదే యగు గోరువంకయు రెంటియందును సమానముగాఁ గలవు. ఈ శుకశారికలు నాయికానాయకుల వివాహసంధానమునఁ బాల్గొనుట రెండు కథలయందును గనవచ్చును. ఈ పైసామ్యబాహుళ్యము ననుసరించి జక్కన రాజశేఖరుని కథకుఁ గథాసరిత్సాగము నందలి విక్రమకేసరి కథయే మూల మనుట నిస్సంశయము.

మల్లన రాజశేఖర కథలోని ప్రధానాంశములు :- జక్కన కథానాయకుఁ డగు 'రాజశేఖరుఁడే' మల్లన రాజశేఖరచరిత్ర ప్రబంధకథానాయకుఁడు. గ్రంధమునకును మల్లన నాయకుని నామమే పెట్టెను. రాజశేఖరుని పురనామము 'వంచక ' యనియు 'ఆవంచక' యనియు నిరుతెఱఁగుల జక్కన పేర్కొనఁగా మల్లన దీనిని 'అవంచి ఆవంచిక ' మని రెండు విధములఁ జెప్పెను. 'ఆవంచక' మనునది రెంటను సమానము. రాజకుమారి చెలికత్తె యగు దూతికకు జక్కన యొసఁగిన 'చతురిక' నామమునే మల్లన గ్రహించెను. పై నామములలో నెవ్వియును కథాసరిత్సాగరకథలో లేక , విక్రమార్కచరిత్రమునందే యుండుటవలన . వాని నటనుండియే మల్లన గ్రహించినట్లు తలంచుటయే సమంజసము. వీనితో పాటు యోగిని వృత్తాంతము, దివ్యజ్ఞానము గల శుకమును విక్రమార్కచరిత్రమునందు వలెనే రాజశేఖర చరిత్రమునందును గలదు. మఱియును జక్కన చెప్పిన రాజశేఖరుని కథయే కొలది భేదముతో రాజశేఖరచరిత్రము నందును సమగ్రముగాఁ గలదు. పైనిఁ దెలిపినవి కాక జక్కన కథలోని తక్కినపేర్లను మల్లన పూర్తిగా మార్చివేసెను. ఇట్లే రాజశేఖరుని నామమును గూడ మల్లన మార్చియుండెనేని, యీ ప్రబంధకథకు జక్కన వర్ణించిన రాజశేఖరుని కథ మాతృక యని గుర్తించుట సాధ్యము కాకుండెడిది.

ఈ రాజశేఖరుని కథను మల్లన దానొక ప్రత్యేక ప్రబంధముగాఁ బెంచి వ్రాయ సంకల్పించిన వాఁడు కావున కొన్ని నూత్నకథాంశములను గల్పించియు, వర్ణనాదులను జేర్చియు మూఁడాశ్వాసములకుఁ బెంచి రాజశేఖరచరిత్ర ప్రబంధమును రసవంతముగా రచించెను. ఇది యొక ప్రత్యేకప్రబంధ మగుట నిందలి సమస్తకథ నిట వివరించుట యనవసర మని తలఁచి విరమించితిని. ఇఁక సర్వసామాన్యముగఁ దలఁపఁబడుచున్నట్లు మల్లన రాజశేఖరచరిత్ర కల్పితప్రబంధము కాదనియు, నిందలి కథకు మూలము జక్కన రాజశేఖరుని కథ యనియు,