పుట:విక్రమార్కచరిత్రము.pdf/23

ఈ పుట ఆమోదించబడ్డది

22

విక్రమార్కచరిత్రమునందలి రాజశేఖరుని కథ

కథోత్పత్తి హేతువు :- కళావతి యను నాగలోక కన్యక యొక్క మౌనవ్రతమును భంగము చేసి, యామెచే రెండవసారి పలికించుటకయి విక్రమార్కుఁడు 'కప్పురపు బరణికి' నిజమంత్రశక్తిచేఁ బ్రాణము పోసి యొక కథ చెప్పుమని కోరఁగా నది యీ క్రింది కథఁ జెప్పెను.

వంచక (ఆవంచక) మను బురమును విక్రమకేసరి యను రాజు పాలించుచుండెను. ఆయన రాణి ఉమావతీమహాదేవి. వారికి రాజశేఖరుఁ డను పుత్రుఁడు కలిగెను. రాజశేఖరుఁడు పితృమార్గము ననుసరించు ఉత్తమక్షత్రియుఁడు. ఒకనాఁ డతఁడు సైన్యముతో వేఁట కేగెను. వేఁటాడుచుఁ బోయి పోయి పార్వతీదేవి మందిరమును గాంచి, దేవికి మొక్కి, యా చెంత నొక రాచిలుకతోఁడ సంభాషించుచున్న యొక యోగిని గని, సమీపించెను. ఆ చిలుక “యఱువదినాలుగువిద్యల నెఱవాది యనియుఁ, ద్రికాలవేది" యనియుఁ జెప్పి దాని నా యోగిని రత్నపంజరముతోఁ గూడ రాజశేఖరున కొసఁగెను.

అంత రాజశేఖరుఁడు దేవ్యాలయసమీపలతాగృహమున విశ్రమించి, యా చిలుకను జూచి కుతూహలముతోఁ దన భావిఫలప్రాప్తినిఁ గూర్చి బ్రశ్నింపఁగా నది యిట్లు చెప్పెను. “సత్యధర్ముఁ డను అవంతీపురాధీశుని కూఁతురగు కర్పూరమంజరి నీకు భార్య కాఁగలదు. వైవాహికవార్తయు నిప్పుఁడే రాఁగలదు". అని చెప్పుచుండగనే చతురిక యను చెలికత్తె దూతికఁగా వచ్చి రాకుమారునకు మ్రొక్కి కూర్చుండెను. అంత నామెను జూచి, చిలుక

“పలుకులనేర్పునం జెవుల పండువు చేసితి వింతసేపు నా
పలుకు శిలాక్షరంబుగ శుభంబది శీఘ్రముగాఁగ నంతయుం
దెలియఁగఁ జెప్పు మింక భవదీయసమాగమనప్రసంగముల్
జలజదళాక్షి యేమిటికిఁ జల్లకు వచ్చియు ముంత దాఁపఁగన్."

అని పలుకరింపఁగా విని యచ్చెరువంది యాసుందరి యిట్లు విన్నవించెను. “సత్యధర్ముఁ డవంతిదేశాధిపతి. అతని రాణి లీలావతి, వీరికిఁ గర్పూరమంజరి యను తనూజ కలదు. అమె సకలవిద్యలు నేర్చిన యందగత్తె. 'ఒకనాఁడు చెలులతో గూడ మన్మథపూజకయి యామె శృంగారవనమున కరిగెను. అచ్చటఁ జిలుకకుఁ బురాణకథలు చెప్పుచున్న యొకశారికను జూచెను. రాజపుత్రిక సమీపించఁగా నది యామె చేతఁ జిక్కెను. రాజకుమారి దాని కళాకుశలత్వమునకు గారణ మడుగఁగాఁ దాను సరస్వతీదేవి చేతిచిలుకచేతఁ బెంపఁబడితి ననియుఁ, ద్రికాలవేది ననియుఁ జెప్పెను. అది విని కర్పూరమంజరి తనకుఁ గాఁబోవు పతిని