పుట:విక్రమార్కచరిత్రము.pdf/228

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

విక్రమార్కచరిత్రము

విక్రమార్కుం డశ్వమేధము నొనరించుట

క.

మనుజాధీశకులోచిత
మనఁబరఁగిన యశ్వమేధయాగం, బది నే
నొనరించెదఁ దదుపక్రమ
మనఘా యెఱిఁగింపు మనిన నతఁ డిట్లనియెన్.

92


సీ.

కాంచనమయములుగా స్రుక్స్రువాదిక
        యజ్ఞసాధనముల నలవరించి
సకలభవ్యద్రవ్యసంపాదనమునకు
        హితుల నియోగింపు మతులగతుల
శాస్త్రోక్తమతమున సంఘటింపఁగఁ బంపు
        మతిపవిత్రస్థలి యజ్ఞశాల
షట్కర్మనిర్వాహచాతురీఖని యైన
        యాజ్జికుచేత ననుజ్ఞ వడయు


తే.

మర్హలక్షణసంపన్న మైనహయము
భూప్రదక్షిణసంచారమునకుఁ బంపు
భట్టిఁ దద్రక్షణమునకుఁ బాలుపఱుపు
వలయురాజుల మునులను పిలువఁ బనుపు.

93


వ.

మఱియు వలయు నుచితకరణీయంబులకుఁ దత్తద్విధిజ్ఞుల నాజ్ఞాపింపుమని పనిచినం దదనుజ్ఞాపూర్వకంబుగా సర్వంబునకుఁ నిర్వాహకుల నియమించి యజ్ఞయజనదివసంబు భావించి చైత్రపూర్ణమాసిగా నిర్ణయించి దీక్షితుండై సుపరీక్షితం బైనయుత్తమాశ్వంబునకు నుచితోపచారంబు లొనరించి దిగంతంబుల సంచారపూతంబులుగా ననుగ్రహించి చనుదెమ్మని ప్రార్థించి యాంగికంబు లైనశుభసూచకంబు లంగీకరించి ప్రమోదాంతరంగుండై భట్టి నవలోకించి.

84


చ.

హితుఁడవు కార్యఖడ్గముల కెంతయు మేటివి సర్వశాస్త్రస
న్మతచరితుండ వార్యుఁడ వమానుషకీర్తివి, నాకు శోభనా
న్విత మగుచారుకీర్తు లొదవింపఁగఁ గర్తవు నీవె, యంచుఁ ద
త్క్రతుహయరక్షకుం బనిచెఁ గర్మవిధేయుని సౌమతేయునిన్.

85