పుట:విక్రమార్కచరిత్రము.pdf/219

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము


ఆ.

అంత నెదురువచ్చి యరవిందమకరంద
కలితసౌరభములు [1]గానుకిచ్చి
యబ్జినీసమీరుఁ డమర యధోచిత
స్థితి నరేంద్రు మనసు చెలఁగఁజేసె.

42


మ.

భువనాధీశ్వరుదర్శనోత్సవసుఖంబుం బొంది యానంద తాం
డవముం జూపెడుభంగి నాకమలషండం బొప్పె భృంగాంగనా
రవగానంబులతో సరోజదళనేత్రశ్రీవిలాసంబుతో
నవచిత్రాభినయోర్మిహస్తఘటనానానావిలాసంబుతోన్.

43


సరోవరవిహారము

ఉ.

ఆకమలాకరంబున విహారము సల్పగ నుత్సహించి, శో
భాకరనూత్నరత్నసముదంచితకాంచనదివ్యభూషణా
నీకములం దొలంగ నిడి, నీరజలోచన లొప్పి రోలిఁ గా
రాకుల నుజ్జగించి చెలువారెడుమవ్వపుఁదీఁగెలో యనన్.

44


ఉ.

ఆనెలఁతల్ సరోజినికినై దిగునప్పుడు, నూత్నరత్నసౌ
పానములం దదీయతనుబంధురబింబము లుల్లసిల్లెఁ దే
జోనిధి యైనయానృపతిసోయగమున్ దరిసించువేడుకం
బూని జలాధిదేవత లపూర్వగతిం జనుదెంచిరో యనన్.

45


సీ.

ఉవిద లందఱుఁ గూడి యొక్కర్తుఁ జెలరేఁగి
        కరయంత్రధారలఁ గప్పికప్పి
జలములో మునిఁగినసఖులయిక్క లెఱింగి
        సలిలంబులోఁ గేలి సలిపి సలిపి
పంచపట్టుల నిల్చి పడఁతు లొండొరులతో
        నలవునఁ జలుఁబోరాడి యాడి
సలిలకేలికి నోడి చను భీరువును బట్టి
        జలజపరాగంబు చల్లిచల్లి


తే.

యొనర నొండొరుభుజము చేనూఁది యూఁది
సరసగతులను జెలఁగి మత్సరము లోర్చి

  1. కానుక + ఇచ్చి