పుట:విక్రమార్కచరిత్రము.pdf/215

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

167


క.

నావుడుఁ దదీయవచన
ప్రావీణ్యంబునను ధరణిపతి ప్రముదితుఁడై
యావైదర్భియుఁ దానును
గేవలలీలావనాంతకేళిరతుఁడై.

22


శా.

లీలాశైలము లెక్కుచుం, దరుణవల్లీలాస్యముల్ చూచుచున్
ఢోలారోహణకేళిఁ దేలుచు, మదాటోపాలిగానధ్వని
శ్రీలాలించుచుఁ గీరభాషణములం జిత్తంబులన్ మెచ్చుచుం
గాలోన్మీలితపుష్పభూరుహతతిం గైసేయుచుం జూడ్కులన్.

23


సీ.

మంజరీసంజాతమకరందమధుమత్త
        చంచరీకద్వంద్వసంభ్రమములఁ
గోరకితానేకకోమలవల్లికా
        వేల్లితభూజాతవిలసనముల
సహకారఫలరసాస్వాదనసంతుష్ట
        [1]శుకసతీపతిరుతిప్రకటనములఁ
గిసలయాంకురరసగ్రసనసముత్కంఠ
        కలకంఠవిటవిటీకలకలములఁ


తే.

గనియు వినియు వసంతసంక్రాంతరాగ
సర్వసామాన్యమహిమ కాశ్చర్యమంది
చెలి కెఱింగించి కొనియాడి చెప్పి చెప్పి
ప్రమనవనకేలిఁ దేలిరి పతియి సతియు.

24


చ.

అలరులు గోయుచోట నళు లాలనసౌరభ సూన మూఁగినం
గలఁగుట గాంచి కొప్పుపయిఁ గమ్మనిసంపెఁగదండ సేర్చి, తొ
య్యలి హృదయంబునందుఁ గుసుమాపచయవ్యసనంబు గ్రమ్మఱన్
మొలవఁగ జేసినన్, నృపతిముఖ్యునిఁ బ్రౌఢలు మెచ్చి రందఱున్.

25
  1. శుకదంపతీరతి ప్రకటనముల. అని పా.