పుట:విక్రమార్కచరిత్రము.pdf/214

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

విక్రమార్క చరిత్రము


క.

కాననవసంతలక్ష్మియొ
నా నుపవనపాలబాల నయవినయగతిం
గానుకతెచ్చినగుచ్ఛము
కానుక గావించె విభుఁడు కాంతామణికిన్.

17


ఉ.

ఇచ్చిన నిచ్చలో నలరి యింతి, దరస్మితకాంతి చెక్కులం
దచ్చుపడం బ్రసన్నవదనాంబుజమై, వనపాలబాలికం
బొచ్చెము లేక రత్నమయభూషణభూషితఁ జేసి, దానితో
మచ్చిక మీఱఁగా మధురమంజులభాషల నల్ల నిట్లనున్.

18


సీ.

ప్రోదిగాఁ బన్నీరుపోసి పెంచినకన్నె
        సురపొన్న యున్నదే సుందరాంగి
పొలుపారఁ బచ్చకప్పురపుబాదున నిడ్డ
        విరజాజి యున్నదే హరిణనయన
యెలమిఁ గస్తురిబూదియెరువునఁ బెరిఁగిన
        సంపెఁగ యున్నదే చంద్రవదన
క్రొవ్వారుజవ్వాదికుదురునఁ బెరిఁగిన
        చేమంతి యున్నదే కోమలాంగి


తే.

సంతతంబును బూఁదేనె జాలువాఱఁ
గమ్మగందవుముద్దలఁ గట్టపెట్టి
కాలువలు దీర్చినపసిండికేళకూళి
నిండి తొలఁకాడుచున్నదే నీలవేణి.

19


వ.

అనిన నయ్యనంగవతీమహాదేవికిం బ్రమదవనపాలబాలికాలలామం బిట్లనియె.

20


చ.

జనవరవంశవారినిధిచంద్రుఁ డనం దగుచంద్రగుప్తనం
దనుకరుణాసుధారసమునం ద్రిజగంబులు పల్లవింపఁగాఁ
బనివడి ప్రోదిచేసి పెనుపం బెనుబొందినతోఁటలోనినూ
తనలతికావలీతరువితానమునొప్పులు చెప్ప నేటికిన్.

21