పుట:విక్రమార్కచరిత్రము.pdf/213

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

165


సీ.

కమలగర్భునిఁ బుత్త్రికాకాముఁ గావించి
        కౌశికు వెలయాలి గవయఁ బనిచి
నిందిరావిభు గొల్లయిల్లాండ్రఁ దగిలించి
        రజనీశు గురుసతిరతి కొనర్చి
రుద్రుని నర్ధపౌరుషునిఁగా నొనరించి
        శుకునితాతకుఁ గామసుఖము నేర్పి
కులిశాయుధునిఁ బట్టి [1]కోడాట లాడించి
        ఋష్యశృంగుతపస్సమృద్ధి మాన్పి


తే.

విషమశరుసకు త్రైలోక్యవిజయ మొసఁగె
నిట్టిచరితంబు లెఱిఁగినయట్టినరులు
విజితకాముల మనుమాట విడువుఁడనుచుఁ
బల్కుగతిఁబల్కెఁ దోఁటలఁ జిల్కగములు.

11


వ.

ఇత్తెఱంగునఁ జిత్తసంభవుసామ్రాజ్యలక్ష్మీనివాసం లైన మధుమాసంబు సకలజంతుజంపతిసంపాదితమనోవిలాసంబై భాసిల్లునంత నొక్కనాఁడు.

12


రాజదంపతుల ఉద్యానవిహారము

క.

నరపతి యనంగవతితో
వరసతులు భజింపఁ ప్రమదవనమున కరిగెన్
సురసతులు గొల్వ శచితో
హరి నందనవనములోని కరిగినభంగిన్.

13


వ.

అంత.

14


మ.

అలరుందేనియ నర్ఘ్యపాద్యముల పర్యాయంబుతో నిచ్చి యిం
పులు మీఱన్ విరవాదిజాదివిరులం బుష్పాంజలుల్ చేసి యు
జ్జ్వలభృంగీనినదంబులం గుశలసంప్రశ్నంబు గావించి, భూ
తలనాథున్ భజియించె గంధవహుఁ డుద్యానాంతరాళంబునన్.

15


వ.

ఆ సమయంబున.

16
  1. కోడి+ఆటలు