పుట:విక్రమార్కచరిత్రము.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

15

రెండు సాలభంజికలే విక్రమార్కుని సాహసౌదార్యాదులను ప్రశంసించు 32 కథలను భోజరాజుకు వినిపించును. ఈ కథలనే సందర్భానుసారవర్ణనాదులలో విస్తరింది గోపరాజు తెలుఁగున రచించె నని పై రెండు గ్రంథములను బోల్చిచూచిన దెలియనగును. ఇక బేతాళపంచవింశతిలోని 25 కథలు విక్రమార్కునకు బేతాళుఁడు స్వయముగాఁ జెప్పినవి. వాని ప్రణాళికయే వేఱు. జక్కన విక్రమార్కచరిత్రకు దానితో సంబంధము లేదు. గీర్వాణ విక్రమార్కచరిత్రము నందలి ప్రాస్తావిక నీతిశ్లోకములకుఁ గొన్నిఁటిని జక్కన తెనుఁగు చేసి యున్నను నిందలి కొన్ని కథలకు సంస్కృతమున సూచనలు కనవచ్చినను సంస్కృత విక్రమార్కచరిత్రమునకు జక్కన విక్రమార్కచరిత్ర మనువాదము కాక చాలవర కిది స్వతంత్ర్యగ్రంథ మనుట వాస్తవము. ప్రస్తుత విక్రమార్కచరిత్రకుఁ బిమ్మట గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, అనంతామాత్యుని భోజరాజీయము, కోవెల గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, కదరీపతి శుకసప్తతి మఱియు అయ్యలరాజు నారాయణకవి హంసవింశతి మున్నగునవి యీ కోవకుఁ జెందిన కావ్యములలోఁ ప్రసిద్ధములు.

ఇట నొక్కమాట. విక్రమార్కచరిత్రము విక్రమార్కునికి సంబంధించిన కథలను వర్ణించునట్లే, అనంతామాత్యుని భోజరాజీయము కూడ భోజరాజు జీవితమునకు సంబంధించిన కథలను వివరించు కావ్యమయినట్లు తఱచు తలంపఁబడుచున్నది. కాని యిది సరికాదు. భోజరాజీయమునందు మొత్త మేడాశ్వాసములు కలవు. వీనిలో ద్వితీయాశ్వాసమునందు మాత్రము భోజరాజు జన్మవృత్తాంతము మఱియు నతఁడు ధారానగరాధిపతి యయిన పిమ్మట సర్పటి యనునొక యౌషధసిద్ధుని మోసగించి “ధూమవేధి" యను రసవాదవిద్యను గ్రహించి యతనిచే శప్తుఁడయి, యనంతర మతని యనుగ్రహమునకుఁ బాత్రుఁడయి సిద్ధుని భోజనము సేయు మని ప్రార్థించును. భోజరాజీయమునందు భోజరాజు కధ యేతన్మాత్రమే. తక్కిన ఐదాశ్వాసములందును సర్పటి తాను “పంచభిక్ష" వ్రతనియమము కలవాఁడు కావున భోజునింట భుజింపజాల నని తెలిపి, భోజరాజ డడుగఁగా సిద్ధుఁ డతనికి భిక్షాటనమహాత్మ్యము, అన్నదానఫలము మున్నగువానిని వివరించు పలుకథలను జెప్పి, పిమ్మట మఱి నాలుగిండ్లలో భిక్షఁగొని తెచ్చుకొని భోజరాజు సహపంక్తిని భుజించుటతో నీకావ్యము సమాప్త మగును. కావున నిందలి ప్రధానేతివృత్తము భోజరాజునకు సర్పటి పంచభిక్షమహాత్మ్యమును, అన్నదానఫలమును దెలుపు కథలను జెప్పుట. తెలుఁగులోని ప్రసిద్ధ కావ్యములలో నిదియు నొకటి.