పుట:విక్రమార్కచరిత్రము.pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది

14


విక్రమార్కచరిత్రము - కథాకావ్యము

విక్రమార్కచరిత్రము ప్రాచీనాంధ్రకథాకావ్యములలో నొకటి. సంస్కృతమున దండి మహాకవి రచించిన వచన దశకుమారచరిత్రమును జంపూకావ్యముగా నాంద్రీకరించి కేతన కధాకావ్యప్రక్రియకు మార్గదర్శకుఁ డాయెను. ఇందు రాజకుమారునితోఁ గూడ మంత్రికుమారాదులు పదుగురు ప్రదర్శించిన సాహసకార్యములను దెలుపు కథ లనేకము వర్ణింపఁబడియున్నవి. గుణాఢ్యపండితుఁడు పైశాచీభాషలో నసంఖ్యాకకధలతో రచించిన బృహత్కథయే భారతదేశీయకథాకావ్యములలో మొట్టమొదటి కధాకావ్యము మాత్రమే కాక తరువాత సంస్కృతభాషయందును, దేశభాషలందును వెలువడిన యిట్టి పెక్కింటి కిదియే మాతృక. ఇది బృహత్కథ యగుట వలన దీనిని గ్రహింపక కేతన కవి లఘుకథాసంపుటి యనఁదగు దశకుమారచరిత్రమునే గ్రహించెను. కేతన యనంతరము మంచనకవి సంస్కృతమున రాజశేఖరకవి రచించిన “విద్ధసాలభంజిక" యను నాటికను గ్రహించి, మూలకథలోఁ గొన్ని మార్పులు చేయుచు, మూలాతిశాయిగా మధ్యమధ్య సుమారు ఇరువది నీతికథలను జేర్చి దీని నొకకథాకావ్యముగ నాంద్రీకరించి కేయూరబాహుచరిత్ర మని పేరుంచెను. ఈ కేయూరబాహుచరిత్రము సంస్కృతనాటకములకు మొట్టమొదటి కావ్యరూపానువాదము; తెలుఁగులో రెండవ కథాకావ్యము. పిదపఁ బేర్కొనఁదగినది యీ జక్కన విక్రమార్కచరిత్రమే. ఐన నిది పైరెంటికంటెను గొంత వైలక్షణ్యము గలదిగా నున్నది. సంస్కృతము నందును విక్రమార్కుని సాహనపరాక్రమౌదార్యములను వర్ణించు పద్యకావ్యములు కలవు. విక్రమార్కచరిత్రము, బేతాళపంచవింశతి యనునవి యిట్టివి. నేను జూచినంతవరకు సంస్కృత విక్రమార్కచరిత్రము నందలి కధలు స్వల్పముగ జక్కన విక్రమార్కచరిత్రము నందును గోచరించినను ఇందలి పెక్కుకథ లందు లేవు. అందలికథ అనేకము లిం దగుపడవు. తెలుఁగు విక్రమార్కచరిత్రము నందలి కొన్నికథలకు మూలము లనఁదగిన కొన్నికథలు బృహత్కథ యందును దాని సంస్కృతాంధ్రానువాదము లగు “కథాసరిత్సాగర” సంపుటము లందును గోచరించును. ఆంధ్రదేశమునందుఁ దన కాలమునఁ బ్రజలలోఁ బ్రచారము నందున్న విక్రమార్కుని కథలను గూడ జక్కన తన కావ్యమునందుఁ జేర్చియుండు నని యూహింపఁబడుచున్నది. "భట్టి విక్రమార్కుల కథ” లను వచనగ్రంథమొకటి యనేకకథలతోఁ గూడినది తెలుఁగులో నున్నను, నిది యత్యాధునికము. జక్కన కించుక తరువాత కొఱవి గోపరాజు రచించిన “సింహాసన ద్వాత్రింశిక" యను పద్యకథాకావ్యము సంస్కృత విక్రమార్కచరిత్రమున కాంధ్రీకరణ మని చెప్పవచ్చును. ఏలయన నీరెంటి యందును విక్రమార్కుని సింహాసనమున కలంకారముగ నుండిన ముప్పది