పుట:వికీపీడియాను మూల్యాంకనం చేయడం (Evaluating Wikipedia, Telugu version).pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

వికీపీడియాను వాడుకరులు ఎలా మెరుగుపరుస్తారు

చాలామంది వికీపీడియా అంటే కేవలం విజ్ఞాన సర్వస్వ వ్యాసాలు అనే భావిస్తారు, వెనుకవెనుక చాలా గొప్ప కృషి జరుగుతుంటుంది, అలాగే వికీపీడియాకు చేసే సగానికి పైగా సవరణలు వ్యాసేతర విభాగంలో జరుగుతాయి. వ్యాసాలు ఎలా రూపొందాలి, వ్యాసాల నాణ్యత, సంపాదకత్వ విధానాలు నిర్ధారించడం వంటి విషయాలు వాడుకరులు చర్చిస్తూంటారు. మీకు ఎక్కడ చూడాలో తెలిస్తే వ్యాసాల్లాగానే ఈ పేజీలు, చర్చలు అందరి పరిశీలనార్థం బహిరంగంగా ఉంటాయి.

ప్రతి వ్యాసానికి దాని చర్చ పేజీ ఉంటుంది. ప్రతి వ్యాసానికి పైన చర్చ అన్న పేరుతో లంకె కనిపిస్తూంటుంది. దాని మీద నొక్కితే వ్యాసాలు తయారుచేయడానికి ఎంత ఆలోచన జరిగిందో మీకు తెలుస్తుంది. మీరు ఏ అంశమైతే ఆలోచిస్తున్నారో దానిపై అప్పటికే చర్చ జరిగి ఉండొచ్చు. వ్యాసం యొక్క నాణ్యతపై మీకేదైనా ప్రశ్నలుండీ, దాన్ని మీకు మీరుగా అభివృద్ధి చేయలేకుంటే, మీ సందేహాలు చర్చ పేజీలో రాయొచ్చు.

చాలా ప్రశ్నలకు కొన్ని రోజుల్లోనే జవాబులు వస్తాయి, లేదా వారం దాకా మీ ప్రశ్న ఎవరి దృష్టిలోనూ పడకపోతే వ్యాసాన్ని రాసినవారిలో ఒక వాడుకరిని నేరుగా అడిగేయడం మంచి ఆలోచన, లేదా మరేదైనా సాధారణ చర్చా వేదికపై రాసి చర్చించవచ్చు. చరిత్రను చూడండి అన్న లింకుపై నొక్కి, వ్యాసానికి ఎక్కువ సవరణలు చేసిన వాడుకరిని చూడండి, ఆపైన అతని లేదా ఆమె వ్యక్తిగత చర్చపేజీలోకి వెళ్ళే లింకు నొక్కండి. ఆ వాడుకరిని ప్రశ్నలు అక్కడ అడగవచ్చు.

వ్యాస నాణ్యతను మూల్యాంకనం చేయడం

వికీపీడియా వ్యాసాల నాణ్యత విస్తృతంగా మారుతూంటుంది; చాలా వ్యాసాలు మంచివి, అయితే కొన్నిటిలో లోతు, స్పష్టత ఉండకపోవచ్చు, లేదా కొన్నిటిలో పక్షపాత ధోరణలు ఉండొచ్చు, లేదా తాజా సమాచారం లేకపోయివుండొచ్చు. ఆంగ్ల భాషా వికీపీడియాలో ఉత్తమ వ్యాసాలను “మంచి వ్యాసాలు” లేదా “విశేష వ్యాసాలు”గా గుర్తించేందుకు పద్ధతివుంది. అయితే పెద్దసంఖ్యలో వ్యాసాలు, వాటిలో కొన్ని మంచివే అయినా, ఈ హోదాలు సాధించలేదు.

ఒక వ్యాసం యొక్క సాధారణ నాణ్యత వేగంగా మీరెలా మూల్యాంకనం చేస్తారు? అందుకు రెండు ప్రధానమైన దారులున్నాయి: • నాణ్యమైన వ్యాసాలకు ఉండాల్సిన అంశాలను తనిఖీచేయండి. • నాణ్యతాలోపాలను చూపే సాధారణ లక్షణాల కోసం చూడండి.