పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/116

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

వరాహపురాణము

రాక్షసజననప్రకారము

క.

పదునాల్గుదివ్యయుగములు | మొదలం జనఁ, బద్మకల్పమున దితిసతికిన్
మదయుతులు సుతులు రాక్షసు | లుదయించిరి, సత్త్వసాహ[1]సోద్ధతు లగుచున్.

58


వ.

అంత.

59


సీ.

ధర్మంబు వదలిరి ధారుణీనాథులు, | సత్యంబు ధాత్రి నుత్సన్నమయ్యె,
బహువిఘ్నములఁ గుంటువడియె యాగంబులు, | నిగమముల్ [2]పాషండనిహతి నొందె,
ప్రజ లనాచారతత్పరత [3]వర్తించిరి, | మాసెఁ బాతివ్రత్యమహిమ లెల్ల,
సంతతదానప్రచారంబు లుడివోయెఁ, | గడుమించె వర్ణసాంకర్యగరిమ,


తే.

మొదవు లేమియుఁ బిదుకక ముణుఁగఁదొడఁగెఁ, | [4]గోరినప్పుడు వానలు గురియటుడిగె,
భూతదయ లేశమాత్రంబు పొడమదయ్యె, | సమదరాక్షసజన్మదోషంబుకతన.

60


దైత్యుల స్వైరవిహారము

ఉ.

ఉగ్రమదాంధబుద్ధులు బలోద్ధతు లిట్టినిశాచరుల్ వివృ
ద్ధాగ్రహులై మహీపతుల నందఱ [5]నోర్చి, సురేంద్రువీటికిన్
నిగ్రహ మాచరించి, వెస నిర్జరపుణ్యసతీజనంబు బం
దీగ్రహణం బొనర్చి, మహనీయధృతిన్ భువనంబు లేలుచున్.

61


ఉ.

నాయ మొకింతలేక యొకనాఁడు సురాద్రికి డాయఁబోయి, య
త్యాయత బాహుదర్పమునఁ - దద్దరిమధ్య నివాసులైన వి
శ్వాయువు [6]పుణ్యకేతనుఁడు వజ్రుఁడు సాల్వుఁడు నాదిగాఁ జమూ
నాయకులం గుఱించి కదనం బొనరింపుచునున్న యత్తఱిన్.

62


హరుఁడు దైత్యులను భస్మము చేయుట

ఉ.

విస్మయ మేమి చెప్ప! గణవీరచమూసహితంబు గాఁగ ద
గ్ధస్మరుఁ డీశ్వరుం డపుడు తద్గిరికిం జని, రాక్షసేంద్రులన్
భస్మము సేయఁ, దద్భసితపంక్తిని [7]షష్టిసహస్రదైత్యు లు
గ్రస్మయు లుద్భవించి రవిఖండితమండితశస్త్రపాణులై.

63
  1. సోదరు-హ
  2. పాదంట - తీ
  3. వహించిరి - తీ
  4. ‘ర’ ప్రతిలో పాదము లుప్తము.
  5. నొంచి-మా; మించి - త
  6. పుష్ప - మా,త
  7. షష్ఠ - మ,మా,హ,ర