పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఇట్లు పరస్పరవీక్షానురాగార్ణవమునఁ దేలెడువధూవరులఁ జూచి
తగు వీరలకు నంచుఁ దమలోన నుభయపక్షములబాంధవు లెల్ల సంతసిల్ల
భిల్లనాథుఁడు తనబిడ్డ నర్జునకీవిలాసిని నొకశుభలగ్నమునను
నవరూపసంపన్నునకుఁ బ్రసన్నునకు వివాహంబు చేసి తద్వైభవంబు
సంపతిల్లినపిమ్మట దంపతులకుఁ, గట్టనిచ్చి మతంగుండు గౌరవమునఁ
దన్ను ననుపంగ నరుగుచోఁ దనయతోడ, బుద్ధి చెప్పఁగ నేకాంతమునకుఁ బిలిచి.

123


సీ.

అత్తమామలు చెప్పినట్ల చేయుదుగాని యెదిరి మారుత్తర మీకు మమ్మ
వలయువేళలఁ బెద్దవారు పంపక యెంతపనికిఁ బోనిండ్లకుఁ జనకు మమ్మ
సకలబంధులకుఁ బూసలలోనిదారంబువలె సరాగంబున మెలఁగు మమ్మ
తోడికోడండ్రు వంతులకుఁ బట్టినచోట ముదరక తాలిమి నుండు మమ్మ
మానసంబున ధర్మ మేమఱకు మమ్మ, నుతికి నెక్కిననీసరిసతులలోన
వాసి గను మమ్మ కులశీలవర్తనములు, కొంచెపఱపక మము విచారించు మమ్మ.

124


క.

కసరకుమీ కోపించిన, విసువకుమీ సేవ చేయువేళల నీగుల్
గొసరకుమీ నీపాలికి, బిసరుహముఖి యేడుగడయుఁ బెనిమిటి సుమ్మీ.

125


వ.

అని బోధించి బాప్పాంబుధారాసిక్తకుచకుంభ యైనకూఁతుం గనుంగొని గద్గదభా
షణంబుల బుజ్జగింప నెట్టకేలకుం బోయి ర మ్మని పలికిన.

126


క.

దిగులుపడుబిడ్డ నచ్చో, డిగవిడిచి చనం గలంగుడెందముతో నే
పగిది జనువాఁడ దైవమ, పగవారికి నైన నాడుఁబడుచుల నీకే.

127


మ.

అని చింతించుచు బంధువర్గసహితుండై చొచ్చె సౌధాగ్రకే
తనఝంపాపవమానకంపితవియద్గంగాస్రవంతీచిరం
తనపానీయ మనంగ నొప్పుమిథిలాస్థానీయమున్ సంతసిం
ప నెఱింగించె వివాహవైభవము ధర్మవ్యానుఁ డిల్లాలికిన్.

128


గీ.

అంత నక్కడఁ దండ్రివాక్యములు దలఁచి, మగనిపట్టున నత్తమామల యెడాట
మున సదాసన్నయై చేయఁఁ బనులు చెంచు, రాకొమారి శతాసిధారావ్రతమున.

129


సీ.

కమలషండములు మేల్కానకమున్నె మేల్కని శుచిభూతయై దినదినంబు
నుటజనివాసాంగణోర్విపై గోమయజలములఁ గలయంపి గలయఁజల్లు.
నభ్యంతరస్థులు లలికి ముగ్గులు పెట్టు నగ్నిహోత్రములకు ననువుపఱచు
దేవపూజావితర్దికల నర్చనకు గంధాక్షతప్రసవమాల్యములు నిలుపు
ప్రొద్దుపాటున బహుభక్ష్యభోజ్యలేహ్య, చోష్యపానీయములు పాకశుద్ధి గాఁగ
వాయితముచేయు గృహభర్త లతిథియుక్తు, లై భుజింపంగ భుజియించునత్త మొదల.

130