పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/240

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తననాథు రుద్రునిఁ దలఁపవచ్చినఁ జూచి దేవ యీపరివారదేవతలకు
భుక్తికిఁ ద్రోవ చూపు మటన్న వారిలోఁ గొందఱితోడ నాయిందుధరుఁడు
నూత్నగృహములఁ దోఁటల నూతులం ద, టాకములఁ జేలఁ జెట్లఁ బంటల వసించి
ప్రజలు వానికిఁ బెట్టెకుబలులవలనఁ, దృప్తిఁ బొందుఁడు మీ రని తెలిపి మఱియు.

130


సీ.

పరవధూటులమైలపరిధానములు గట్టుచూలాండ్ర గొందఱు సోఁకుఁ డనియు
యంత్రమంత్రౌషధాద్యముల రక్షిత గానిబాలెంతఁ గొందఱు పట్టుఁ డనియు
నెప్పుడుఁ గలహించి యేడ్చుచుండెడుశఠస్త్రీలఁ గొందఱు ప్రవేశింపుఁ డనియు
నెడరైనచోటున నేమఱుపాటుగా శిశువులఁ గొందఱు చెందుఁ డనియు
కోరి నిలువుండు ఫుకెటింటఁ గొంద ఱనియు, నందఱికి నన్నిగతుల నాహారవిధులు
పంచిపెట్టి రణక్షోణిఁ బడినరురునిఁ, గాంచి తనశక్తిమహిమ నుతించఁ దొడఁగె.

131

మాత్రాసమకతాళము

జయజయ చాముండి వికరాళి మహాకాళి శివే సిధ్యే వేద్యే భీ
మాక్షి మహామాయి క్షుభితే కాళి కరాళి శవయానస్థే ప్రేతాసనభేదివిభీషణే భూత
భయంకరి సకలక్షేమంకరి సర్వహితే బాలే నృత్తగీతవాద్యవిలోలే కాలాపహారిణి
క్షాంతే కాంతే సర్వదేవతారాధ్యే భోధ్యే కాళరాత్రిమహితాభ్యుదయే భూతాప
హారిణి జయే పాశాంకుశహస్తే జ్వాలాముఖిఘనశృంగే తీక్ష్ణదంష్ట్రికే ఫాలలోచనే
త్రిశిఖముఖదళితరురుదనుజతనుజననసమయసముదితఖచరకరగళితసురవిటపికుసుమ
విసరపరిమిళితరుధిరమధురమధురసరసనసమదనటనపరిజనే పటుమహిమజనే.

132


క.

అని వినుతించిన శాంభవి విని మెచ్చి త్రినేత్ర వరము వేఁడుము నా నే
జనుఁ డీభవదీయస్తుతి, వినుఁ జదువును వాని కిమ్ము వివిధేప్సితముల్.

133


గీ.

ఇదియ నే వేఁడువర మని యిందుశేఖ, రుఁడు తిరోహితుఁ డయ్యె నారుద్రశక్తి
బ్రహ్మశక్రముఖామరప్రతతి పనిపి, జగము లేలుచునుండె నచ్చటనె తాను.

134


వ.

తమోగుణప్రధానయుం బరాపరాభిధానయు సంహారకారణియు నగురుద్రశక్తికి
నవకోటిభేదంబులు గలవు రజోగుణప్రధానయు లోకస్థితికారిణియు నగువిష్ణుశక్తి
కిం బదునెనిమిదికోట్లు భేదంబులు గలవు సత్త్వగుణప్రధానయుఁ బరాభిధానయు
సృష్టికారిణియు నగుబ్రహ్మశక్తికి లెక్కింపరానిభేదంబులు గలవు. వీరికి నిందఱికిని
నిన్నిరూపంబులం బతియై రుద్రుండు రమింపుచుండు వీరి నారాధించుమాంత్రికులు
రుద్రునికి నమ్మినభక్తులు బ్రాహ్మియు వైష్ణవియు రౌద్రియు ననం బరఁగినయీత్రి
కల నవసిద్ధాన్తగామినియై త్రిశక్తినామంబులును సర్వవేదాంతగామినియై జ్ఞానక్రియా
శక్తినామంబులును వహించు లోకోపకారంబుగాఁ బరమపురుషుండు మూఁడుమూ
ర్తులు దాల్చినయట్ల యేకస్వరూప యగునిమ్మహాశక్తియం మూర్తిత్రయంబు వహించె
నింతియె కాని భేదంబు లేదు మహారహస్యంబుగ నీదేవీమాహాత్మ్యం బష్టమిం గాని

135