పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/238

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అంగీకరించి వైష్ణవి, గంగాధరముఖ్యసురనికాయంబుల నం
పెం గడువేడుకఁ దా శత, శృంగనగోత్తుంగశృంగసీమన నిలిచెన్.

118


గీ.

వార్ధిరశన రెండవది యైనయీశక్తి, సంభవంబు వినిన సజ్జనులకు
నబ్బు నిక్క మపునరావృత్తిశాశ్వత, బ్రహ్మలోకసౌఖ్యపదవిభూతి.

119


చ.

విను మిఁక నీలశైలవనవీథికిఁ బోయినరౌద్రి విశ్వపా
లన మొనరింతు నే ననుతలంపునఁ బంచహుతాశిమధ్యసీ
మ నిలిచి యోగనిశ్చలసమాధిఁ దపం బొనరించె హల్లకం
బునడుమ నున్నసీధురసమోదిమదాళినిభంగి నత్తఱిన్.

120


సీ.

అబ్ధిమధ్యమున రక్తాక్షకం బనుపట్టణము రాజధానిగా నమితకోటి
దానవసేనలు తన్నుఁ గొల్వఁగ నున్నవనరుహాసనలబ్ధవరుఁడు రురుఁడు
నా నొక్కదైత్యుండు నముచిపాకపులోమబలుల మించిన భుజాబలముకలిమి
గర్వించి సర్వసుపర్వసామ్రాజ్యంబు గైకొందు నని దండు గదలఁ దలఁచి
ఘుమఘుమారంభసంరంభఘూర్ణమాన, కలిలసలిలంబుతో వార్షికడల వెడల
కాద్రవేయులకన్నులు గాతుకలఁగ, భీకరజయానకము చఱపించుటయును.

121


వ.

మహాహవసన్నాహసముత్సాహంబున వాహినీసమూహంబు లంభోధిగర్భంబు నిర్భ
రగతి వెడలునప్పుడు వెండిచిప్పలజోళ్ళతోడిపదాతులు తిమింగిలంబులభంగి
నింగికిం జౌకలించిరి యింతకాలంబునకుం దమపగ సాధింప దిక్కు గలిగె నని
రక్కసులఁ గూడి వజ్రపాణిమీఁద వచ్చు ఱెక్కలతోడికొండలరీతి సచామర
శుండాలంబులు గగనమండలి కెగసె నురుగులతోడితరంగంబులకరణి సఫేనముఖ
తురంగధట్టంబులు మిన్నుముట్టె దినముఖోదయదినకరస్యందనంబు నాందోళిత
ధ్వజపటధాళధళ్యమిషంబునం బరిహసించునరదంబు నంబరంబునకు లంఘించె
నివ్విధంబునం గటాక్షితప్రతిపక్షలక్ష్యంబు లైనమహారథలక్షలును శతకోటి
జిత్వరంబు లైనకరిఘటాకోటులును గంభీరహేషావధీరితశంఖంబు లైనహయశం
ఖంబులును వీరలక్ష్మీనివాసపద్మంబు లైనసుభటపద్మంబులుం గలదండనాయకు లనే
కులు గొల్వ నసురవరుం డగురురుండు సముద్రంబు వెడలి నిర్నిద్రపరాక్రమంబున
దాడి వెట్టినం గని దేవతలు గోపించి యెదిరించి కవిసి రప్పు డిరువాగు రణలక్ష్మి
డోల ననుకరించె నింద్రాదినిర్జరు లసురశరజర్జరితాంగులై వెఱచి పఱచువారు
ముందట నీలగిరిశృంగంబునఁ బంచాగ్నిమధ్యంబున న్నిలిచి యెలమావిచిగురుజొం
పంబులోనికోయిలవిధంబున విద్రుమకుడుంగంబునడిమితమాలవల్లికపగిది సంధ్యా
రాగాంతరాళంబునం గనుపట్టుమేఘరేఖసరణి నరుణకమలవనాభ్యంతరంబు
నున్ననీలోత్పలినితెఱంగున రురుదానవవధోచితక్రోధరసపరివృతం బైనతమో