పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/231

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డ్రవృధాసందడి గాసిఁ బొంద మన కేలా పాఱిపోవంగఁ జే
య వలెం బేటనపెట్టి యంచు నెనుపెంటై భీకరప్రక్రియన్.

75


సీ.

హోమగుండములపై కుఱికి కొంకరకోఱకొమ్ములఁ గోరాడుఁ గొంతతడవు
దేవపూజావితర్దికలకై లంఘించి గొరిజల నురుమాడుఁ గొంతతడవు
పసిడాలు గలవరిపచ్చలపైఁ బడి గొదగొని భక్షించుఁ గొంతతడవు
కమలాకరములపైఁ గవిసి నీరు గలంచి క్రోలుచు బుసకొట్టుఁ గొంతతడవు.
గోండ్రుగోం డ్రని గర్జించుఁ గొంతతడవు, గోరచూపులు వీక్షించుఁ గొంతతడవు
గునుకుపరువునఁ దిరుగాడుఁ గొంతతడవు, కొయ్యతనమునఁ గోపించుఁ గొంతతడవు.

76


క.

అయ్యెడఁ దాపసకన్యలు, దయ్యము గా కెనుము గాదు తథ్యం బనుచున్
బయ్యెదలు జాఱఁ బాఱఁగఁ, జయ్యన మునిపుంగవుండు శంబరుఁ డాత్మన్.

77


క.

మాయామహిషీతను దై, తేయాధిపకన్య యగుట దెలిసి పటుక్రో
ధాయత్తత శపియించెను, హాయనశత మిట్లు మహిషివై పొమ్మనుచున్.

78


ఉ.

ఈకరణిం దపస్వి శపియింప భయంపడి దైత్యకన్య ల
య్యా కడుఁగల్ల చేసె నిది యైన సహింపవలెన్ మది న్మహి
ష్యాకృతి దాల్పవచ్చునె శతాబ్దము లంచుఁ గదుష్ణబాష్పధా
రాకులనేత్రలై నిజపదాంబుజయుగ్మముమీఁద వ్రాలినన్.

79


గీ.

వినుఁడు పడుచులార వృధవోదు నామాట తనయు నొకనిఁ గన్నదాఁక నేత
దాకృతిఁ జరియించు నంతట నిజమూర్తిఁ, జెందు ననుచు నవధి చెప్పుటయును.

80


సీ.

శంబరాశ్రమవనస్థలము వెల్వడి కొన్నిదినములు మాహిష్మతీకుమారి
నర్మదాతీరకాననముల విహరించుచుండ నచ్చోట నత్యుగ్రతపము
సలుపు సింధుద్వీపజననాథుఁ డొకనాఁడు విద్యున్మతీనామవిబుధవైరి
కన్యక వస్త్రంబు గట్టక జలదంబుఁ బాసినక్రొమ్మించుపగిది మెఱసి
యెదుట జలకేళి గావింపఁ దదఖిలాంగ, ములు నిరీక్షించి గిలిగింత వోవుమనసు
నిలుపలేనికతంబున నిర్గమించెఁ, జరమధాతువు శైలనిర్ఝరము వోలె.

81


చ.

అదియుఁ దపోమయాంగభవ మైనకతంబున దివ్యసౌరభా
స్పదమును జంద్రమండలవిభాసియు నై పవనాతపంబులన్
జెదరక నిల్చె నంత మహిషీతనుధారిణి యైనవిప్రజి
త్తిదనుజకన్య తన్నికటదేశమునం జరియించుఁ గావునన్.

82


క.

పసివడి మాటికి మాటికి, వసుధాస్థలి మూరుకొనుచు వదనాంచల మా
కసమున కెత్తుచుఁ జవిగొని, యిసు మంతయుఁ జిక్కకుండ నింతయుఁ గ్రోలెన్.

83