పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/221

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈకరణి సార్వకాలము, రాకాసి మదంబు కవిసి రాకం బోకం
జీకాకు పఱుప వేసరి, నాకౌకసు లెల్ల వచ్చి నా కెఱిఁగింపన్.

13


సీ.

ఎల్లభక్తులకును గొల్లగా వేఁడినవరము లీఁ గలవ్యయవాదికాఁడు
సచరాచరప్రపంచమును బాలించురాచాఱికమ్ముకాణాచికాఁడు
మిక్కిలి కనుమంట మింటఁ బాఱుపురాలు భస్మంబు చేసినపంతగాఁడు
కోలాహలాభీలహాలాహలజ్వాల మెడబంటి మెసఁగిన మేఁతకాఁడు
శంభుఁ డుండంగ మనల కీశంక యేల, రెండు పోద మటంచు నాఖండలాది
సురలఁ దోడ్కొని యేను దేవరకుఁ దెలియ, విన్నవించుటకై పనివింటి నిపుడు.

14


ఉ.

నిత్యము నిర్వికల్ప మతినిర్మల మీభవదీయ మైనదాం
పత్యము కన్నులారఁ గనుభాగ్యము మా కొనఁగూడెఁ గాన సం
స్తుత్యము నేఁటివాసరము సోమకళాధర నీకు గౌరికిం
గృత్యము లోకరక్షణము క్రీడలు రాక్షసశిక్ష లెప్పుడున్.

15


సీ.

జ్ఞానంబు నీవు మోక్షంబు దాక్షాయణి ఫలము నీవు తపంబు భద్రకాళి
మంత్రంబు నీవు సామర్థ్యంబ చండికప్రాణంబు నీవు దేహంబు దుర్గ
ప్రామినుకులు నీవు ప్రణవంబు పార్వతి చవియు నీ వమృతంబు సకలజనని
భక్తియు నీవు విరక్తియు శాంభవి యర్థంబ నీవు వాక్యంబు గౌరి
శక్తిలో నీవు నీలోన శక్తి యెపుడుఁ, బాయకుందురు భాస్కరప్రభలు వోలె
నీరహస్యంబు మదిలోన నెఱుఁగలేక, మొత్తులాడుదు రూరక మత్తిగాండ్రు.

16


క.

అని యిట్లు పెక్కుభంగుల, వినుతించి విరించి తన్ను వీక్షించిన నా
కనకాచలకోదండుఁడు, వనజోదరుఁ దలఁప వచ్చె వారలు ముగురున్.

17


శా.

ఏకీభావముతోడ నొక్క రొకరిన్ వీక్షింప నాచూపులన్
రాకాచంద్రనిభాస్య కోకకుచ నానారత్నభూషాంగి ది
వ్యాకారంబున నొక్కకన్య జననం బయ్యెన్ దనుచ్ఛాయ లా
శాకాశావనిమండలిన్ దిమిరసంధ్యాచంద్రికల్ చల్లఁగన్.

18


సీ.

ఆమూఁడువర్ణాలలేమ కోమలహాసభాసమానకపోలభాగ యగుచు
హరిహరబ్రహ్మాదిసురల విలోకించి కలకంఠకలకుహూకారచారు
భాషణంబుల నీప్రపంచంబు సర్వంబు గన్న మహామాయ నన్ను మీర
లెఱుఁగ రే మీకోరి కేమైనఁ దీర్చెదఁ జెప్పుఁ డటన్న నాచెలువఁ జూచి
నలువయును వెన్నుఁడును జలి వెలుఁగుఁదాల్పు, నోమహాశక్తి వినుము నీ నామకంబు
త్రికళ యిటమీఁద నీచేయుప్రకటవిక్ర, మముల మఱియును బెక్కునామములు గలవు.

19