పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/220

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కొండరాయనిముద్దులకూఁతుకరము, నిజకరంబునఁ గీలించి నిగమనేత్ర
హస్తహుంకృతి ముందట నంబరస్థ, లంబు దాఁకంగ నాహజారంబు చొచ్చి.

8


శా.

ఓహో భైరవ నీల రుద్ర నిలు సాహో వీరభద్రేశ కుం
భాహూ రాకు నికుంభ యందు వడి సమ్మర్దంబు వారించుచున్
బాహూత్తంభితవేత్రవల్లి గదలన్ దండప్రభుం డుద్ధత
వ్యాహారంబులచే బరాబరులు చేయన్ రత్నవేదిస్థలిన్.

9


సీ.

విజయాకరాంబుజవ్యజనానిలంబులఁ దూలుకుంతలములు దువ్వి దువ్వి
ప్రమథులవికృతవేషములు చూడు మటంచుఁ జెవి చేరి మెల్లనె చెప్పి చెప్పి
పగిడిబింగన్నకొడగములు వీక్షించి హాసంబుతోఁ జేయి వేసి వేసి
తనచేత నుండక వెనకయ్య గినిసిన నెత్తుకొ మ్మని చేతి కిచ్చి యిచ్చి
చిత్త మిగురింప వేడ్కలు బిత్తరింప, నవయవంబులఁ బులకంబు లంకురింప
శైలకన్యయుఁ దానును సరసగతుల, మేల మాడుచు నొకగద్దెమీఁద నుండి.

10


వ.

గండకపుండరీకశుండాలగండభేరుండముఖులును రుక్షచక్షుశ్శ్రవోహర్యక్షతరక్షు
సదృక్షముఖములును శరభకరభసైరిభసన్నిభముఖులును గాకఘూకకోకసూకర
భీకరముఖులును గుక్షిముఖులును వక్షోముఖులును హస్తముఖులును మస్తముఖులును
బశ్చాన్ముఖులునుం దిరశ్చీనముఖులును మొద లైనప్రమథులును జేగురింపుజడలును
నిరులు కవియు మెడలును జలి వెలుంగుతునుకలుఁ బ్రామినుకులదొరపునుకలు బేసి
చూపులు ముమ్మొనలచే ప్రాపులు మలకలపేరులు వలపులనీరులుం గలసారూప్యధారు
లు నగస్త్య పులస్య శాండిల్య మాండవ్య రైభ్య బాభ్రవ్య ప్రముఖనిఖిలసంయములు
గరుడగంధర్వసిద్ధవిద్యాధరాదిదేవయోనులు సముచితప్రకారంబున సేవింప వారల
నాదరింపుచుఁ బేరోలగం బుండునవసరంబునఁ బురుహూతప్రభృతిదేవతావితాన
సమేతుండై విధాత యేతెంచిన యథావిధానంబున బహూకరించి కరుణారస
విభూషితంబు లగుభాషితంబులం బితామహా యీమహేంద్రాదిబృందారకు లంద
ఱుం గందినముఖారవిందంబులం గుందినదెండంబుల నున్నవారు తారు దైతేయ
వీరులచేతఁ బరాభూతులు గారు గదా వీర లిచ్చటికి వచ్చిన నిమిత్తంబు చెప్పు
మనిన వనజభవుండు వినయంబున.

11


శా.

దేవా రక్కసుఁ డొక్కరుం డతిబలోద్రేకంబునం దాడి రా
ధావద్దంతి విహస్తబస్తము పతద్వాహారి మోహన్నరం
బావల్లన్మకరంబు భీతమృగ మార్తాశ్వంబు భగ్నోక్షముం
గా వైకల్యముఁ బొందు నింద్రముఖదిక్పాలాలయగ్రామముల్.

12