పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/205

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

యోజనలక్షపరిమితం, బాజంబూద్వీపచక్ర మందుఁ గడలఁ బై
డౌజసమణినేమికరణి, రాజిల్లును లవణజలధిరాజం బెపుడున్.

104


క.

ఆదీవికిఁ బ్రాగుత్తర, మేదిని హిమహేమకూటమేరుశిఖరముల్
పాదుకొని పూర్వచరమమ, హోదధులం దఱిసి మెఱయు నుర్వీధరముల్.

105


క.

ఆగిరులలోన మేరువు, ప్రాగుత్తరదక్షిణాపరదిశలఁ దెలుపున్
జేగురు హళఁదియు నలుపును, నై గుఱుతుగఁ దెలుపు బ్రాహ్మణాదికజాతుల్.

106


సీ.

వరుసతో హరినీలవైడూర్యశుక్లహిరణ్మయశ్వేతబర్హద్విరేఫ
శాతకుంభప్రభాన్వీతంబు లహియక్షసిద్ధచారణదివ్యసేవితములు
సాహస్రనవకయోజనవిస్తృతాంతరవిష్కంభములు పృథివీధరములు
క్రేవల నిలువ నిలావృతాహ్వయవర్ష మాలవాలాకృతి నావరింప
నడుమఁ జతురస్రవృత్తమై నాటు గలిగి, ధగధగాయితకనకరత్నప్రతాన
కిరణముల నాలుకలు గ్రోయు కీలములుగ, సురనగంబు విధూమాగ్నికరణి మెఱయు.

107


చ.

యతివరులార నీలనిషధాద్రులు తక్కినవర్షభూధర
ప్రతతులలోన మిక్కిలియుఁ బ్రస్తుతి గన్నవి లక్షయోజనా
యతములు వీనిగూర్చి కిరుదైనవి చావున హేమకూటప
ర్వతమును మంచుగొండయును ద్వాదశవింశతియోజనంబులన్.

108


సీ.

వర్షపర్వతమధ్యవర్తినానావిధజనపదస్థలులు వర్షంబు లయ్యె
నవి తొమ్మిది పరస్పరాగమ్యములు సరిద్ఘోరకాననజంతుపూరితములు
వీనిలో నాలుగు విలువంక లోడవంకలు నాల్గు చతురస్రకం బిలావృ
తంబు మేరువునకు దక్షిణోత్తరముల నుండు నెన్మిది చుట్టిరా నుండు నొకటి
యాయిలావృతవర్షంబు హత్తి యెడమ, వంకఁ గుడివంక నీలపర్వతము నిషధ
పర్వతము నుండు నీరెండుపర్వతముల, నడుమఁ గనుపట్టు మాల్యవన్మహిధరంబు.

109


చ.

అలఘుసువర్ణకూట మగునగ్గిరికిన్ ద్విసహస్రయోజనం
బుల పొడవున్ వెడల్పు మఱి ముప్పదినాలుగువేలయోజనం
బులనిడు పవ్విధంబునిడుపుం బొడవుం గలగంధమాదనా
చలము తదద్రిపశ్చిమదిశన్ నిలుచున్ వినుఁ డింకఁ జెప్పెదన్.

110


సీ.

కలిగె నవ్యక్తంబువలన నారాయణాత్మక మైనసలిలంబు తజ్జలమున
నడుమ నెన్బదివేలునాల్గుయోజనములయౌన్నత్యమును బదియాఱువేలు
యోజనంబులపాఁతు నొగి నంతవలమును వలమున కినుమడింతలవెడల్పు